Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్’ పోస్టర్ రిలీజ్.. దర్శకుడి క్షమాపణ
ABN , Publish Date - May 10 , 2025 | 03:29 PM
'ఆపరేషన్ సిందూర్’ పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా సిద్థం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
'ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా సిద్థం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరీ (Uttam maheshwari) టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమయం, సందర్భం లేకుండా సినిమా టైటిల్ ప్రకటించడం పట్ల నెటిజన్ల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో దర్శకుడు క్షమాపణ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇతరుల మనోభావాలను గాయపరచడం లేదా రెచ్చగొట్టడం నా ఉద్దేశం కాదు. మన సైనికుల ధైౖర్య సాహసాలను త్యాగాన్ని, నాయకత్వాన్ని ఒక పవర్‌ఫుల్ కథగా వెండితెరపైకి తీసుకురావాలని అనుకున్నా. దేశం పట్ల నాకున్న గౌరవాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించాలనుకున్నా. అంతేకానీ ఫేమ్ కోసం కాదు. డబ్బు కోసం అంతకన్నా కాదు. సమయం, సున్నితత్వం కొంత మందికి అసౌకర్యం కలిగించి ఉండొచ్చు. అందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఇది దేశ ప్రజల ఎమోషన్’’ అని ఆయన రాసుకొచ్చారు.
గత నెల 22న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు మహిళలు వారి కళ్ల ముందే తమ భర్తలను కోల్పోయారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సినీ తారలు సైతం సైనికులకు హ్యాట్సాఫ్ చెబుతూ మద్దతు పలుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా చేేసందుకు ఎన్నో నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపించాయి. ఆ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డాయి. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై ఉత్తమ్ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో శుక్రవారం రాత్రి సినిమా ప్రకటించారు.