Operation Sindoor : ఆ టైటిల్ పై అందరి దృష్టి...

ABN , Publish Date - May 08 , 2025 | 06:57 PM

ఆపరేషన్ సిందూర్ టైటిల్ పై ప్రముఖ సినిమా నిర్మాణ కంపెనీలు కన్నేశాయి. పహల్గామ్ ఉదంతం నుండి ఆపరేషన్ సిందూర్ వరకూ జరిగిన పరిణామాలను వెండితెర కెక్కించాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు.

పహల్గామ్ (Pahalgam) లో భారతీయ పర్యాటకులను మతం అడిగి మరీ హమార్చిన పాక్ ఉగ్రవాదుల పీచమణచడానికి భారత్ ప్రారంభించిన కార్యక్రమం 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor). తొలి రోజున ఏకంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసింది. ఉగ్రవాదులను తయారు చేస్తున్న కార్యాలయాలను దిగ్విజయంగా నేల మట్టం చేసింది. అయితే... ఇది ఆరంభం మాత్రమే... దాదాపు 30 ఉగ్రవాద సంస్థల నిలయాలను ఇంకా ధ్వంసం చేయాల్సి ఉందని, అందుకోసం భారత్ ఆర్మీ కాపు కాచుకున్నదని వార్తలు వస్తున్నాయి.


పహల్గామ్ ఉదంతంతో పాటు ఆపరేషన్ సిందూర్ ను వెండితెరపైకి ఎక్కించడానికి ఇప్పటికే పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా ముందుగా 'ఆపరేషన్ సిందూర్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడానికి రెడీ అయ్యాయి. అయితే వీటిలో టి. సీరిస్, జీ స్టూడియోస్ వంటి ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలు ఉండటం విశేషం. ఒకవేళ ఈ అంశాన్ని సినిమాగా తెరకెక్కిస్తే మాత్రం ఖచ్చితంగా దానిని వారు పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మిస్తారు. ఎందుకంటే... గతంలో ఇలా పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేసిన సందర్భాలలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. వాటిలో చాలా చిత్రాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. పూర్తి స్థాయిలో కథను ఈ కార్యం మొత్తం పూర్తయిన తర్వాత తయారు చేయొచ్చు కానీ ముందైతే టైటిల్ ను కైవసం చేసుకుందామని తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. నిజానికి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒకటి కాదు... రెండు మూడు సినిమాలు బాలీవుడ్ (Bollywood) లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ టైటిల్ ను చేజిక్కించుకున్న సినిమాకు ఉండే క్రేజ్ మిగిలిన సినిమాలకు ఉండదు. అందుకే వీరంతా ఆ పేరు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read: Anil Ravipudi: చిరు తర్వాత ఆ హీరోతోనే సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 08 , 2025 | 06:57 PM