Durandhar: నిర్మాత నాగ‌వంశీపై.. బాలీవుడ్ సెటైర్లు

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:36 PM

ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆ మధ్య బాలీవుడ్ గురించి చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు తిరిగి వైరల్ గా మారింది. 'దురంధర్' మూవీ విజయం సాధించిన నేపథ్యంలో సిద్ధార్థ్‌ ఆనంద్ చేసిన కామెంట్ నాగవంశీకి స్ట్రాంగ్ రిటార్ట్ అని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Naga Vamshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) నటించిన తాజా చిత్రం 'దురంధర్' (Durandhar). ఆదిత్య ధ‌ర్(Aditya Dhar) ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt), అక్షయ్ ఖన్నా (Akshye Khanna), ఆర్. మాధవన్ (R Madhavan), అర్జున్ రాంపాల్ (Arjun Rampal) కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ బాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ (Naga Vamshi) అనూహ్యంగా సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యారు. దీనికి కారణం స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఇచ్చిన ఒక వివాదాస్పద సమాధానం! ఈ పరిణామం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.

ప్రముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamshi), 'దురంధర్' విజయం సాధించిన నేపథ్యంలో, అనుకోకుండా బాలీవుడ్ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒక 'ఎక్స్' యూజర్... 'దురంధర్' విజయాన్ని ప్రస్తావిస్తూ, నాగ వంశీ పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన ఫోటోను పోస్ట్ చేసి, 'ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు?' అని ప్రశ్నించారు. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ వెంటనే స్పందిస్తూ, 'ఎక్కడో నిద్ర పట్టక బాధపడుతున్నాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనంద్ దాన్ని డిలీట్ చేశారు. అయినప్పటికీ, స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

WhatsApp Image 2025-12-11 at 1.17.59 PM.jpeg


వివాదానికి కారణమైన పాత వ్యాఖ్య

సిద్ధార్థ్ ఆనంద్ ఈ విధంగా స్పందించడానికి కారణం, గతంలో నాగ వంశీ చేసిన ఒక కామెంట్ అని తెలుస్తోంది. ఒక రౌండ్‌టేబుల్ చర్చలో, నాగ వంశీ మాట్లాడుతూ, 'పుష్ప 2 (Pushpa-2) ఒక్క రోజులో రూ. 80 కోట్లకు పైగా నెట్ వసూలు చేసినప్పుడు ముంబై మొత్తం నిద్ర పోయిందని నేను అనుకోను' అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపింది. తెలుగు సినిమా మార్కెట్, బాలీవుడ్ కలెక్షన్స్ గురించి పోల్చి చెప్పడంపై చాలామంది బాలీవుడ్ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. నాగవంశీ ఈ అంశాన్ని పక్కనపెట్టినప్పటికీ, ఆ వివాదం తాలూకు కోపం బాలీవుడ్ వర్గాల్లో ఇంకా ఉందని సిద్ధార్థ్ ఆనంద్ రిప్లై స్పష్టం చేస్తోంది. అందుకే 'దురంధర్' సక్సెస్ వేదికగా వంశీని ఎగతాళి చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి నిర్మాత నాగ వంశీ... యంగ్ హీరో నవీవన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' (angana oka raju) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. బాలీవుడు దర్శకుడు చేసిన ఈ పరోక్ష వ్యాఖ్యలపై ఆయన మళ్లీ స్పందిస్తారా? లేదా మౌనంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, 'దురంధర్' విజయోత్సవ వాతావరణంలో, ఈ రెండు పరిశ్రమల మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 05:14 PM