Mumbai Film Festiva: ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రద్దు.. అధికారిక ప్రకటన

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:15 PM

సుమారు మూడు ద‌శాబ్దాలుగా విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తూ వ‌స్తోన్న ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రద్దు చేశారు.

mami

భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ అరుదైన సంఘ‌ట‌న జ‌రిగింది. భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ చిత్రోత్సవంగా గుర్తింపు పొందిన, సుమారు మూడు ద‌శాబ్దాలుగా విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తూ వ‌స్తోన్న మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (Mumbai Film Festival) ఈ సంవత్సరం జరగదని నిర్వాహకులు సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. ఈ మేర‌కు ఫెస్టివల్ డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగర్పూర్ సోషల్ మీడియా (X)లో ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ పోస్టులో.. 2025 ఎడిషన్ రద్దు చేస్తున్నాం. త్వ‌ర‌లో కొత్త టీమ్ చేర‌బోతుందని, వారి నేతృత్వంలో ఈ ఫెస్టివల్‌ను మరింత అద్భుతంగా మార్చడానికి కృషి చేస్తున్నాం. ఇండియా నుంచే కాక‌ ప్రపంచం నలుమూల‌ల నుంచి వచ్చే అనేక ఇండిపెండెంట్‌, ప్రాంతీయ, క్లాసిక్ సినిమాలకు ఈ ఫెస్టివల్ కేంద్రంగా అగ్రస్థానంలో నిలబడేలా ప్రయత్నిస్తామ‌ని అన్నారు. తిరిగి..ఫెస్టివల్ 2026లో ఉంటుంద‌ని, కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామ‌న్నారు.

Mumbai Film Festiva

కాగా.. 2025 ఫెస్టివల్ ర‌ద్దు కావ‌డంపై అనేక మంది సినీ ల‌వ‌ర్స్ నిరుత్సాహం వ్య‌క్తం చేస్తున్నారు. సినీ, ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైకి తన స్వంత ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వ‌హించ‌లేక పోవ‌డం విచిత్రంగా ఉంద‌ని అంటున్నారు. కేన్స్‌, రెడ్ కార్పెట్ అంటూ విదేశాల ఫెస్టివల్స్‌కు ప‌రుగులు పెట్టిన‌వారు ఇప్పుడు త‌మ‌సొంత ఫిలిం ఫెస్టివ‌ల్‌ను గాలికొదిలేశారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇదిలాఉంటే.. 1997లో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (MAMI) ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించగా ఆమీర్ ఖాన్ వంటి స్టార్‌లు ఆర్థికంగా సాయం చేశారు. ప్రియాంక చోప్రా, కిరణ్ రావ్‌లు చైర్‌పర్సన్‌లుగా పనిచేశారు. 2023లో జియో స్పాన్సర్‌గా ఉండగా, 2024 ఎడిషన్ ఓ మోస్త‌రుగా జరిగింది. ఆపై గ‌త ఏడాదే అనుపమా చోప్రా స్థానంలో శివేంద్ర సింగ్ దుంగర్పూర్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Jul 23 , 2025 | 12:53 PM