Javed Akhtar: నాస్తికుడినని, నరకానికి వెళతానని అంటారు.. కానీ..

ABN , Publish Date - May 18 , 2025 | 05:32 PM

బాలీవుడ్‌ రచయిత జావెద్‌ అక్తర్‌ (Javed Akhtar) మరోసారి పాకిస్థాన్‌పై మండిపడ్డారు. ఆ దేశానికి వెళ్లడం కంటే నరకానికెళ్లడం మంచిదని ఆయన అన్నారు.

బాలీవుడ్‌ రచయిత జావెద్‌ అక్తర్‌ (Javed Akhtar) మరోసారి పాకిస్థాన్‌పై మండిపడ్డారు. ఆ దేశానికి వెళ్లడం కంటే నరకానికెళ్లడం మంచిదని ఆయన అన్నారు. శివసేనఎంపీ సంజయ్‌ రౌత్‌ ‘నరకాత్‌లా స్వర్గ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో శివేసన (యూబీటీ) అధినేత ఉద్థవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై జావెద్‌ అక్తర్‌ మాట్లాడుతూ ‘‘నేను నాస్తికుడినని, నరకానికి వెళతానని కొందరు అంటారు. మరోవైపు, నేను జిహాదీనని, పాకిస్థాన్‌కు వెళ్లాలని అంటుంటారు. పాకిస్థానా, నరకమా? అన్న పరిస్థితి వస్తే నేను నరకాన్నే ఎంపిక చేసుకుంటా. ఎన్నో సందర్భాల్లో నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నన్ను చాలామంది వ్యతిరేకించారు’ అని పేర్కొన్నారు.



పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన జావేద్‌ కొన్ని రోజుల క్రితం పాల్గొన్న కార్యక్రమంలో.. గతంలో ఓ పాకిసాన్‌ జర్నలిస్ట్‌కు తాను గట్టిగా బదులిచ్చినట్లు అన్నారు. ‘‘ఓసారి నేను లాహోర్‌లో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యా. ఓ పాకిస్థ్థానీ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు గట్టి జవాబిచ్చా. ‘భారతీయులంతా పాకిస్థ్థానీయులను ఉగ్రవాదులుగా భావిస్తున్నారా? అని అడిగారు. ‘నేను ముంబై వాసిని. నా నగరంపై ఎన్నో సార్లు దాడులు జరిగాయి. నా నగరం తగలబడటం నేను కళ్లారా చూశా. ఆ దాడులకు కారణం స్వీడన్‌, ఈజిప్ట్‌ నుంచి వచ్చిన వారు కాదు.. వారంతా పాక్తిస్థాన్‌ నుంచి వచ్చినవారే. ఇప్పటికీ వారు పాక్‌లో  స్వేచ్ఛగా తిరుగుతున్నారు’ అని చెప్పాను. ఆ మరుసటి రోజే నేను లాహోర్‌ నుంచి తిరిగి వచ్చాను. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే నా కామెంట్స్‌ పాక్‌లో ఉద్రిక్తతల దారి తీశాయని విన్నాను’ అని గుర్తు చేసుకున్నారు.

Updated Date - May 18 , 2025 | 05:32 PM