హౌస్‌ఫుల్‌ 5: బాలీవుడ్‌ ఎంత నిజాయతీగా సినిమాలు తీస్తుందో..

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:35 PM

బాలీవుడ్‌లో పాపులర్‌ ఫ్రాంచైజ్‌ సినిమాల్లో హౌస్‌ఫుల్‌ (House full 5) చిత్రం ఒకటి. 2010లో ఈ చిత్రాల సిరీస్‌ మొదలైంది. కామెడీ ఇందులో కీలకంగా తెరకెక్కిన చిత్రమిది.


బాలీవుడ్‌లో పాపులర్‌ ఫ్రాంచైజ్‌ సినిమాల్లో హౌస్‌ఫుల్‌ (House full 5) చిత్రం ఒకటి. 2010లో ఈ చిత్రాల సిరీస్‌ మొదలైంది. కామెడీ ఇందులో కీలకంగా తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. యాక్షన్‌ కామెడీ, రొమాంటిక్‌ కామెడీ, కామెడీ డ్రామా.. థ్రిల్లర్‌ కామెడీ.. జోనర్‌ పైకి ఇలా కనిపించినా.. సినిమాలో కంటెంట్‌ హాట్‌ హాట్‌గానే ఉంటుంది. కావలసినంత మసాలా అది అడల్ట్‌ కామెడీ హౌస్‌ఫుల్‌ సిరీస్‌ల ప్రత్యేకత. ఇప్పటివరకు ఈ సిరీస్‌ బాగానే నడిచింది. కానీ తాజాగా వచ్చిన ‘హౌస్‌ఫుల్‌ 5’ మాత్రం కాస్త హద్దులు దాటిందనే చెప్పాలి. కామెడీ పేరుతో అశ్లీలం, డర్టీ డైలాగులతో వెగటు పుట్టించిందన్నది సత్యం. అక్షయ్‌ కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌, రితీష్‌ దేశ్‌ముఖ్‌, సంజయ్‌ దత్‌, నానా పటేకర్‌, జాకీ ష్రాఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నర్గీస్‌ ఫక్రీ, సోనమ్‌ బజ్వా, జానీ లివర్‌.. ఇలా గొప్ప నటులు ఈ చిత్రంలో నటించారు. కానీ వినోదం పేరుతో లాజక్కులు లేని గరమ్‌ మసాలాను దట్టించి తెరకెక్కించారు.

సినిమా మొత్తం డబుల్‌ మీనింగ్‌ డైలాగులతోనే నిండిపోయింది. మహిళల్ని ఆక్షేపించేలా సౌత్‌ సినిమాలు ఉంటాయని బాలీవుడ్‌లో చాలామంది పెద్దలు ఓ సమయం వరకూ విమర్శిస్తూనే ఉన్నారు. ఈ సినిమా చూశాక బాలీవుడ్‌ ఎంత నిజాయతీగా సినిమాలు తీస్తుందో తెలుస్తోంది. కామెడీ పేరుతో అశ్లీల చిత్రీకరణ చేసిన విధానం చూస్తే ముక్కున వేలేసుకోవలసిందే. కథలో బలం లేకపోవడంతో ఇలా మసాలా సీన్లు, ద్వంద్వార్థాలతో  సినిమాను చుట్టేశారనిపిస్తుంది. ఈ సినిమా తంతు చూస్తే బాలీవుడ్‌ మరో మెట్టు దిగజారినట్టే అని తెలుస్తోంది.

Updated Date - Jun 07 , 2025 | 08:35 PM