Indian Films: నెల రోజుల వ్యవధిలో నాలుగు చిత్రాలు ఒకే తీరుగా...
ABN , Publish Date - Jul 21 , 2025 | 06:10 PM
నెల రోజుల వ్యవథిలో వచ్చిన నాలుగు సినిమాలకు సంబంధించిన కథాంశాలలో ఓ పాయింట్ లో సారూప్యత ఉండటం ఆసక్తికరంగా మారింది.
చిత్రసీమలో ఎప్పుడు ఏ ట్రెండ్ కాసుల వర్షం కురిపిస్తోందో తెలియదు. అయితే గడిచిన నెల రోజుల వ్యవథిలో వచ్చిన నాలుగు సినిమాల్లో కొన్ని సారూప్యాలు ఉండటం ఆసక్తిని కలిగిస్తోంది. జూన్ 20న వచ్చిన 'సితారే జమీన్ పర్' (Sithare Zameen Per), 'డిఎన్ఎ (DNA)' చిత్రాలలోనూ, జూలై 18న వచ్చిన 'తన్వీ (Tanvi) , సయారా (Saiyaara)' సినిమాల్లోనూ కొన్ని పోలికలు ఉండటం విశేషం.
ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan) 2007లో 'తారే జమీన్ పర్' చిత్రాన్ని రూపొందించాడు. బుద్ధి మాంద్యం కలిగిన ఓ కుర్రాడి జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని ఆమిర్ తెరకెక్కించాడు. కళ్ళలో నీళ్ళు తెప్పించే ఈ సెంటిమెంట్ సినిమా అప్పట్లో కాసుల వర్షం కురిపించింది. దాంతో మళ్ళీ ఇంతకాలానికి దివ్యాంగుల జీవితాన్ని నేపథ్యంగా తీసుకుని ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' మూవీని నిర్మించారు. ఇందులో ఆయన, జెనీలియా కీలక పాత్రలు పోషించారు. 2018లో వచ్చిన స్పానిష్ మూవీ 'ఛాంపియన్స్' కు ఇది అఫీషియల్ రీమేక్. ఇందులో బాస్కెట్ బాల్ కోచ్ గా ఆమిర్ నటించాడు. విశేషం ఏమంటే... ఆయన కోచింగ్ ఇచ్చేది సాదాసీదా వ్యక్తులకు కాదు. వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు! వీరందరినీ ఒక త్రాటిపైకి తీసుకొచ్చి, వారిని విజయపథంలోకి తీసుకెళ్ళడానికి కోచ్ గా ఆమిర్ ఎలాంటి కృషి చేశాడనేది 'సితారే జమీన్ పర్' కథాంశం. ఈ ఇంటలెక్చువల్లీ ఛాలెంజెడ్ బాస్కెట్ బాల్ ప్లేయర్స్ విజయం సాధించారా? లేదా? అనేది పక్కన పెడితే.. ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకున్నారు. ఈ యేడాది విడుదలైన చిత్రాలలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన మూడో చిత్రంగా 'సితారే జమీన్ పర్' నిలిచిందని ఓర్మాక్స్ మీడియా సంస్థ తెలిపింది. 'సితారే జమీన్ పర్' సినిమా జూన్ 20న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది.
సరిగ్గా జూన్ 20న తమిళంలో అధర్వ మురళీ, నిమిషా సజయన్ జంటగా నటించిన 'డి.ఎన్.ఎ.' మూవీ రిలీజ్ అయ్యింది. నెల్సన్ వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ బుద్ధి మాంద్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమెకు పెళ్ళి ఎలా చేయాలో తెలియక తల్లి బాధపడుతూ ఉంటుంది. చివరకు రిహాబిలేషన్ సెంటర్ నుండి వచ్చిన ఓ డ్రగ్ ఎడిక్ట్ కు ఇచ్చి పెళ్ళి చేస్తుంది. వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేస్తున్న సమయంలో ఊహించిన సమస్య వచ్చి మీద పడుతుంది. దాంతో హీరోయిన్ కు పాత రోగం తిరగబెడుతుంది. మానసిక దౌర్భల్యం ఉన్న గృహిణిగా నిమిషా సజయన్ చక్కగా నటించి, మెప్పించింది. దాంతో ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. సో... ఇక్కడ కూడా ఓ దివ్యాంగురాలి కథే... సినిమాను విజయపథంలోకి తీసుకెళ్ళింది. ఈ సినిమా తెలుగులో 'మై బేబి'గా డబ్ అయ్యి, జూలై 18న జనం ముందుకొచ్చింది. తొలి మూడు రోజుల్లో ఇది రూ. 35 లక్షల గ్రాస్ ను వసూలు చేసిందని నిర్మాత చెబుతున్నారు.
ఇదిలా ఉంటే... 'సితారే జమీన్ పర్, డి.ఎన్.ఎ.' విడుదలైన తర్వాత మాసంలో జూలై 18న రెండు హిందీ సినిమాలు వచ్చాయి. అవే 'తన్వీ ది గ్రేట్', 'సయారా'. ఈ రెండు సినిమాల్లోనూ... హీరోయిన్లు మానసిక వైకల్యంతో బాధపడేవారే. అనుపమ్ ఖేర్ రూపొందించిన 'తన్వీ' కథాంశం మొత్తం ఆడిజమ్ మీద సాగుతుంది. ఆటిజంతో బాధపడుతున్న తన్వీ అనే అమ్మాయి ఆర్మీలో చేరి, సియాచిన్ లోని ఇండియన్ ఫ్లాగ్ కు సెల్యూట్ చేయాలనుకుంటుంది. ఆర్మీ ట్రైనింగ్ లో ఆమె తన వైకల్యాన్ని ఎలా జయించిందన్నది ఇందులోని ప్రధానాంశం. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేదు. జూలై 18నే వచ్చిన 'సయారా' చిత్రం మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నూతన నటీనటులతో మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా సాగిపోతోంది. ఇందులోనూ హీరోయిన్ కు ఓ వైకల్యాన్ని దర్శకుడు పెట్టడం విశేషం. ఒకసారి ప్రేమలో భంగపడ్డ హీరోయిన్ డిప్రషన్ నుండి బయటకు వచ్చి కొత్త జీవితం మొదలు పెట్టిన తర్వాత ఆల్జీమర్ తో మళ్ళీ ఇబ్బందుల పాలు కావడం ఇందులోని ప్రధానాంశం. సో... 'సయారా' సైతం ఇదే కోవకు చెందిన సినిమా అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆ రకంగా నెల రోజుల వ్యవధిలో వచ్చిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల అటెన్షన్స్ ను ఇలా డ్రా చేయడమన్నది విశేషమే!
Also Read: Natti Kumar: ఫిష్ వెంకట్ కు ఎందుకు సాయం చేయాలి...
Also Read: Tollywood: నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణితో స్పెషల్ చిట్ చాట్