Harnaaz Sandhu: చుక్కలను అందుకొనేంత ఎత్తుకు ఎదగాలనేది ఆమె కోరిక   

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:02 PM

సుస్మితా సేన్‌, లారా దత్తాల తర్వాత మన దేశం నుంచి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకొన్న మూడో సుందరి హర్మాజ్‌ సంధు. సుస్మిత, లారాల మాదిరిగానే హర్మాజ్‌ కూడా బాలీవుడ్‌లోకి తాజాగా రంగ ప్రవేశం చేసింది.

సుస్మితా సేన్‌, లారా దత్తాల తర్వాత మన దేశం నుంచి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకొన్న మూడో సుందరి  హర్నాజ్ సంధు. సుస్మిత, లారాల మాదిరిగానే హర్మాజ్‌ (Harnaaz Sandhu) కూడా బాలీవుడ్‌లోకి తాజాగా రంగ ప్రవేశం చేసింది. ఆమె నటించిన ‘బాగీ 4’ ఓటీటీలో కూడా దూసుకువెళుతోంది. బాలీవుడ్‌ ప్రవేశం గురించి.. తాను చేయదలుచుకున్న పాత్రల గురించి హర్నాజ్ అంతరంగం ఆమె మాటల్లోనే..

‘బాగీ 4'  తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాకు ఫోన్‌ చేసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి దాకా నన్ను అందరూ మిస్‌ యూనివర్స్‌గా మాత్రమే చూశారు. కానీ ఈ సినిమా తర్వాత నన్ను ఒక నటిగా గుర్తిస్తున్నారు. ఈ విషయం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.  నా తొలి సినిమా ఇది. అయితే దర్శకుడు సాజిద్‌ నదియవాలా, నా హీరో టైగర్‌ ష్రాఫ్, ఇతర నటీనటులు నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నారు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని చాలా ప్రభావితం చేస్తారు. సినీ రంగంలో అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఏ చిన్న సమస్య ఎదురైనా- అది మొత్తం అందరినీ ప్రభావితం చేస్తుంది. అందుకే ఆడుతూ పాడుతూ పనిచేయాలంటారు. ఈ సినిమా షూటింగ్‌ అలాగే సాగింది. సెట్‌లో ఉన్న వారందరికీ తాము ఏం చేస్తున్నామో తెలుసు. అందువల్ల ఎటువంటి టెన్షన్‌ ఎదురవ్వలేదు. 

Harnaaz Sandhu (1).jpg

జీవితం మారిన క్షణం

2021లో నాకు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. ఆ క్షణం నుంచి నా జీవితం మారిపోయింది. అప్పటిదాకా నేను చండీగఢ్‌కు చెందిన ఒక మధ్యతరగతి అమ్మాయిని. మిస్‌ యూనివర్స్‌ అయిన తర్వాత నేను మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అంబాసిడర్‌ను. నేను చేసే ప్రతి పనిని అందరూ చూస్తూ ఉంటారు. అందువల్ల వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి వచ్చేది. మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాల్సి వచ్చేది. ఇలా ఈ నాలుగేళ్ల సమయంలో నేను నా జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్నాను. ఇక నేను సినిమా నటిని అవ్వాలనేది కూడా బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే! నేను సినీ రంగంలోకి వెళ్తానని చెప్పినప్పుడు మా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. మా అమ్మ నాకు కొండంత అండగా నిలిచింది. నేను ఆకాశంలో చుక్కలను అందుకొనేంత ఎత్తుకు ఎదగాలనేది ఆమె ఆశ, ఆకాంక్ష. ఆమె ఆశను నిజం చేయటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను.

ఆరోగ్యకరమైన ఆహారం అంటే...

ఇంట్లో వండిన ఆహారాన్నే తింటా. జపనీస్‌ ఆహారమంటే ఇష్టం. ఇక పంజాబీ ఫుడ్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను తినే ఆహారంలో హై ప్రొటీన్‌, ఎక్కువ ఫైబర్‌ ఉండేలా చూసుకుంటా. ఉదయాన్నే లేచిన వెంటనే చియా సీడ్స్‌ను నీళ్లలో నానబెట్టి తింటా. ఇక ప్రతి రోజూ ఒక చిన్న కప్పు ఐస్‌క్రీమ్‌ తింటా.

Harnaaz Sandhu (2).jpg

అందం కోసం

నా దృష్టిలో మంచి హృదయంతో ప్రశాంతంగా ఉన్నవారు అందంగా కనిపిస్తారు. అందుకోసమే నేను లేచిన వెంటనే మెడిటేషన్‌ చేస్తాను. చల్లటి నీళ్లతో మొహాన్ని కడుక్కుంటా. మెడిటేషన్‌ వల్ల రోజంతా నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చల్లటి నీళ్ల వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. ఇక నేను బయట దొరికే సౌందర్య సాధనాలను వాడను. మా ఇంట్లో తయారుచేసే ఫేస్‌ఫ్యాక్‌లనే వాడతాను. దీని వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.

ఆరోగ్యకరమైన జీవనం కోసం ధ్యానం చేయాలి. తగినన్ని నీళ్లు తాగాలి. మన చుట్టూ పాజిటివ్‌ ఎనర్జీ ఉన్న వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి

నాకిష్టం...

నాకిష్టమైన నటి ప్రియాంక చోప్రా. నచ్చిన సినిమా ‘ముజే షాదీ కరోగి’. నచ్చిన క్యారెక్టర్‌ ‘షోలే’ సినిమాలో బసంతి.

Updated Date - Nov 02 , 2025 | 05:05 PM