Shah Bano: యామీ గౌతమ్ నట విశ్వరూపం 'హక్'
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:20 PM
యామి గౌతమ్ తాజా చిత్రం 'హక్' టీజర్ విడుదలైంది. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషించిన 'హక్' సినిమా షా బానో కేసు ఆధారంగా తెరకెక్కింది.
ప్రముఖ నటి యామీ గౌతమ్ (Yami Gautam) మరో సంచలన చిత్రంలో నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) తో కలిసి ఆమె ప్రధాన పాత్రను పోషించిన 'హక్' (Haq) చిత్రం నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా 'హక్' సినిమా టీజర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. భారతీయ ముస్లిం సమాజంపై విశేష ప్రభావం చూపించిన షా బానో కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మహ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగమ్ కేసులో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు లాండ్ మార్క్ గా నిలిచింది. దానిపై కొన్ని రాజకీయ పక్షాలు భిన్న స్వరాలను వినిపించాయి. దేశాన్ని ఒక కుదుపు కుదిపిన ఈ కేసు నేపథ్యంపై 'హక్' సినిమాను జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో పర్సనల్ లా వర్సెస్ సెక్యులర్ లా గురించి చర్చించినట్టు దర్శకుడు సుపర్న్ ఎస్ వర్మ తెలిపారు.
జిగ్నా వోరా రాసిన 'బానో: భారత్ కీ బేటీ' పుస్తకం ఆధారంగా 'హక్' సినిమా రూపుదిద్దుకుంది. భారతీయ ముస్లిం మహిళకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని, తాము భారత్ లో నివసిస్తున్న మహిళలమనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు సమ న్యాయం కల్గించాలంటూ కోర్టు రూమ్ లో యామి గౌతమ్ ఆవేదనను వ్యక్తం చేయడం టీజర్ లో హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా ఉమ్మడి పౌరస్మృతిని కోరే భారతీయ ముస్లిం మహిళ గాథగా కనిపిస్తోంది. 'ఆర్టికల్ 320' తర్వాత యామి గౌతమ్ నటించిన 'హక్' సినిమా సైతం చర్చనీయాంశంగా మారే ఆస్కారం ఉంది.
Also Read: Film Awards: జాతీయ సినిమా అవార్డుల ప్రదానం
Also Read: Pawan Kalyan: 'ఎ' సర్టిఫికెట్ ప్రభావం 'ఓజీ'పై పడుతుందా...