Baaghi 4: మస్తాన్.. మటన్ షాప్ బెటర్! ఆ నరుకుడేందిరా.. ఇదెక్కడి చండాలం రా నాయనా
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:51 AM
బాలీవుడ్ అయ్యగారు, రీమేక్ సినిమాల కింగ్ టైగర్ ష్రాఫ్ నూతనంగా నటిస్తోన్న చిత్రం 'భాగీ 4'.
బాలీవుడ్ అయ్యగారు, రీమేక్ సినిమాల కింగ్ టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నూతనంగా నటిస్తోన్న చిత్రం 'భాగీ 4' (Baaghi 4). ఇప్పటి వరకు 'పరుగు, వర్షం, క్షణం, తడాఖా' సినిమాలను రీమేక్ చేస్తూ వచ్చిన ఆయన తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు సిద్దమవుతుండగా అది ఏ చిత్రానికి రీమేక్ అనేది తెలియాల్సి ఉంది. గత సంవత్సరమే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనమ్ బజ్వా (Sonam Bajwa), మిస్ యూనివర్స్ హర్నాజ్ కౌర్ సంథు (Harnaaz Kaur Sandhu) కథానాయికలుగా నటించారు. సంజయ్‌దత్ (Sanjay Dutt) ప్రతినాయకుడిగా చేయగా సాజిద్ నడియావాలా ఈ సినిమాను నిర్మించాడు.
కన్నడ అగ్ర దర్శకుడు, 'అంజనీపుత్ర, వజ్రకాయ, వేద, భజరంగీ' సిరీస్ మూవీస్, తెలుగులో గోపీచంద్‌తో 'భీమ' వంటి సినిమాలు రూపొందించిన ఎ. హర్ష (A. Harsha) ఈ సినిమాతో డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నాడు. కాగా 'భాగీ 1'కి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, 2, 3 లను అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ అండ్ థర్డ్ పార్టులలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా సెకండ్ పార్ట్‌లో దిశా పటాని నటించారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ క్యురియాసిటీని పెంచగా అంతకుమించి అనేలా విమర్శకులకు గురైంది. అయితే.. ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకుంటోంది. ఎక్కడైనా టీజర్ చూసిన వారు ఎప్పుడెప్పుడు సినిమాకు వెళదామా అని ఊవిళ్లూరుతూ ఉంటారు.. కానీ ఈ టీజర్ చూసిన వారు మాత్రం అప్పటివరకు ఉన్న ఇంట్రెస్ట్ పోవడమే గాక 'భవిష్యత్తులో ఇక వాటి జోలికి వెళ్లను. బతికున్నన్ని రోజులు ఏ సినిమా చూడను కూడా చూడను' అని అనుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.
ఒక నిమిషం 49 సెకండ్లు ఉన్న ఈ టీజర్‌లో.. ప్రతి ఫ్రేమ్‌లో రక్తపాతం తప్పా మరేమి కనిపించ లేదు. 'యానిమల్, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, కిల్', మలయాళ చిత్రం 'మార్కో' సినిమాలను రంగరించి ఈ చితాన్ని తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. హీరో నుంచి మొదలు పెట్టి విలన్, హీరోయిన్ ఇలా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ శ్రుతిమించి మరి మనుషులను అడ్డంగా, ఇష్టమొచ్చినట్టుగా నరుక్కు పోవడమే కనిపించింది. మధ్యలో 'యానిమల్' తరహాలో ఓ పంజాబీ పాటనే గాక సిల్వర్ మాస్క్ మనుషులు కూడా దర్శనమిచ్చారు. హాలీవుడ్ జాన్ విక్ సినిమాలను ఆదర్శంగా తీసుకున్నారో లేక గతేడాది బాలీవుడ్‌లో వచ్చిన 'కిల్'ను చూసి ప్రేరణ పొందారో గానీ వాటినన్నింటిని మించేలా, భవిష్యత్‌లో మరోటి రాదు అనేలా ఈ చిత్రం తీసినట్లు తెలుస్తోంది.
అంతేగాక ఇప్పటివరకు ఏ ఇండస్ట్రీలోనూ రాని హింసాత్మక చిత్రంగా దీని పేరును చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా ఈ మూవీ సన్నివేశాలు ఉన్నాయి. ప్రతి సీన్‌లో మనుషులను పార్టులు పార్టులుగా, పదే పదే నరకడం, అందులోనూ వేరియేషన్స్, హీరోయిక్‌గా చూపించడం దారుణంగా ఉంది. ఈ టీజర్ చూసిన వారికి, చూసే వారికి వెగుటు పుట్టించడమే గాక మనలో ఓ రకమైన ఫీలింగ్ రాయడం ఖాయం. ఇలాంటి ఈ మూవీకి సెన్సార్ బోర్ట్ సర్టిఫికెట్ ఇస్తుందా?, ఈ టీజర్‌కైనా అలా ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మూవీకి ఆర్ రేటింగ్ ఇవ్వడం కూడా చాలా తక్కువే అవుతుందనడంలో ఎలాంటి డౌట్లేదు.
ఓ సందర్భంలో మటన్ కొట్టే మస్తాన్ షాప్ అయినా బెటర్ కదరా అక్కడ ఇంత హింస, రక్తపాతం కూడా ఉండదు కదరా.. అసలు ఈ సినిమా ఎలా తీయగలిగారు, జనం ఎలా చూస్తారనుకున్నారు, అసలు నేటి తరానికి ఏం చూపించాలని అనునుకుంటున్నారు, ఏం చెప్పాలని అనుకుంటున్నారు అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఈ మూవీ మేకర్స్‌ను విమర్శిస్తున్నారు. టీజర్ చూసిన వారంతా నోటికొచ్చింది తిట్టే వాళ్లే తప్పితే బావుంది పోయి చూద్దాం అని అనే వారు ఒక్కరు లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇంతకుముందు వచ్చిన 'యానిమల్, కిల్' సినిమాలనే విమర్శించిన బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఈ సినిమాపై ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. 'యానిమల్' మూవీ చూసిన వారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఓ సైకోగా ట్రీట్ చేస్తూ దీన్ని సినిమా అంటారా, అలా ఎలా తీశారు ఈ సినిమాను బ్యాన్ చేయాలి అని హడావుడి చేసిన పలువురు హిందీ నటులు, మీడియా నానా హంగామా చేసింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా మొత్తం చూడకున్నా ఈ టీజరే ఇంత ఘోరంగా ఉంటే ఇక మూవీ ఎలా ఉందో, ఉండబోతుందో అర్థమవుతుందని, మరి దీనికి ఆ సో కాల్డ్ బాలీవుడ్ ఎలాంటి సమాధానం చెబుతుందని చాలామంది నెటిజన్లు నిలదీస్తున్నారు.