Mothers Day: అమ్మ అద్భుతం.. ఆమెకే తొలి ప్రణామం..
ABN , Publish Date - May 11 , 2025 | 08:20 AM
నేడు (మే 11న) ‘మదర్స్ డే’ సందర్భంగా... కొందరు సెలబ్రిటీలు అమ్మతో అనుబంధాన్ని పంచుకుంటున్నారిలా..
సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు. ఆమె ప్రేమకు మించిన ఆనందం ఉండదు. అందుకే ‘మాతృదేవోభవ...’ అని ఆమెకే తొలి ప్రణామం చేస్తారెవరైనా. నేడు (మే 11న) ‘మదర్స్ డే’ సందర్భంగా... కొందరు సెలబ్రిటీలు అమ్మతో అనుబంధాన్ని పంచుకుంటున్నారిలా..
నా సూపర్‌స్టార్
నా జీవితంలో అమ్మ పోషించిన పాత్ర అద్భుతం. ఆమె ఏ రోజూ ఇలా ఉండు, అలా ఉండు అని ఆంక్షలు పెట్టలేదు. ప్రతీ కష్టంలోనూ నాకు తోడుగా నిలిచింది. నాకు మద్దతిచ్చింది. చిన్నప్పుడు అమ్మ తన ఒళ్లో కూర్చోబెట్టుకుని రకరకాల కథల్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పడం, జోకులు వేయడం... ఇలా అమ్మతో నాకు బోలెడు జ్ఞాపకాలున్నాయి. అవి నాకు అత్యంత మధురమైనవి. నో డౌట్... మా అమ్మే నా సూపర్‌స్టార్.
- నయనతార
నా ధైర్యం... స్థయిర్యం...
జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. అయినా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా అమ్మ ఇచ్చిన ధైర్యమే. ఒంటరి తల్లి అయినప్పటికీ, ఎంతో స్థయిర్యంతో నన్ను పెంచిన తీరును నేనెప్పటికీ మర్చిపోలేను. అమ్మ ఆలోచనలు అర్థం చేసుకుని స్వతంత్రంగా పెరిగాను. ప్రతీసారీ మనం అనుకున్నదే కచ్చితంగా జరగాలని లేదు. అలాంటప్పుడు కోపం, చిరాకు వస్తుంటాయి. కానీ చూసే కోణంలోనే సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయాన్ని ఆమె నుంచి నేర్చుకున్నా.
- సారా అలీఖాన్
నా రోల్‌మోడల్...
ప్రతీ ఒక్కరి జీవితంలో స్ఫూర్తి ప్రదాతలు అనేకమంది ఉంటారు. అయితే నా జీవితానికి తొలి రోల్‌మోడల్ మా అమ్మ (నీతా అంబానీ). నా కెరీర్ లక్ష్యమేంటో తెలియజేసి, నేను నా గమ్యాన్ని చేరుకునేలా వెన్నుతట్టింది. ఇప్పుడు నన్ను వ్యాపారంలో దూసుకెళ్లేలా ప్రోత్సహిస్తోంది. కేవలం కెరీర్ పరంగానే కాదు.. నా ఆసక్తుల్ని గుర్తించి నాకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. తన వల్లే అటు వ్యాపారంతో పాటు... ఇటు పెయింటింగ్, డ్రాయింగ్‌ల వంటి అభిరుచుల్లోనూ నన్ను నేను నిరూపించుకోగలుగుతున్నా.
- ఈషా అంబానీ
నా ఫ్రెండ్... గైడ్...
మా అమ్మ దృఢమైన మహిళ. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొంటూ, కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో తన నుంచి నేర్చుకున్నా. అమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. తను వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం ప్రత్యేకించి కొంత సమయం కేటాయిస్తుంది. నాకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో, నేను ఎప్పుడెలా ఉంటానో... నాకన్నా తనకే బాగా తెలుసు. తను నా బెస్ట్ ఫ్రెండ్, గైడ్. అందుకే ఏ సందేహం వచ్చినా ముందు తనకే ఫోన్ చేస్తా.
- అనన్య పాండే
క్రమశిక్షణకు మారుపేరు
నా విజయాల్లో మా అమ్మ కీలక పాత్ర పోషించింది. చిన్నప్పట్నుంచే నన్నెంతో క్రమశిక్షణతో పెంచింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా... ప్రతీదీ ప్రణాళిక ప్రకారం జరగాలని రూల్ పెట్టేది. ఆ క్రమశిక్షణే నేను షూటింగ్‌లో ఏకాగ్రతను సాధించేలా చేసింది. ప్రపంచ మేటి షూటర్లలో ఒకరిగా ఎదిగానంటే అది అమ్మ చలవే. నాకు ఇప్పటికీ గుర్తు... 2020 టోక్యో ఒలింపిక్స్ షూటింగ్‌లో తుపాకీ మొరాయించడంతో అర్థాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ బాధలో కెరీర్‌ని వదిలేయాలనుకున్నప్పుడు అమ్మ నాలో ధైర్యాన్ని నింపి, పిల్లర్‌లా నిలిచింది.
- మను బాకర్