Aneet Padda: సైయారా.. వెనుక ఇంత కథ నడిచిందా
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:32 AM
స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా... నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’
కొన్నిసార్లు బాక్సాఫీస్ మేజిక్ జరుగుతుంటుంది. స్టార్లు లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా... నిశ్శబ్దంగా విడుదలై.. బాలీవుడ్‌లో కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది ‘సైయారా’ (Saiyaara). కుర్ర హీరోయిన్ అనీత్ పడ్డా ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం యువతరం ‘నయా క్రష్’గా నీరాజనాలు అందుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ విశేషాలివి.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో... ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 22 ఏళ్ల అనీత్ పడ్డా (Aneet Padda)కు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. స్కూలింగ్ పూర్తయ్యాక ఢిల్లీకి వెళ్లిన అనీత్.. అక్కడి జీసస్ మేరీ కాలేజీలో డిగ్రీ (సోషియాలజీలో) పూర్తిచేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ అవకాశాల్ని అందిపుచ్చుకుంది. ‘సైయారా’ సినిమా చిత్రీకరణ సమయంలోనూ షూటింగ్‌కి హాజరవుతూనే, డిగ్రీ పరీక్షలు రాసింది. ‘ఆమె కమిట్‌మెంట్, అంకితభావం అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మోహిత్ సూరి (Mohit Suri). అనీత్‌ను హీరోయిన్‌గా ఫైనల్ చేయడానికి డైరెక్టర్ మోహిత్ సూరికి సుమారు 5 నెలలు సమయం పట్టిందట. ముఖం, శరీరానికి ఎలాంటి కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోని 20-22 ఏళ్ల యువతి ఆ పాత్రకు కావాలని మోహిత్ పట్టుబట్టారట.
ఈ క్రమంలో వందలాది మందిని ఆడిషన్ చేశారు. అనీత్ తన ఆడిషన్ వీడియోని మొదట మొబైల్‌లో పంపిందట. అది నచ్చడంతో నేరుగా వచ్చి ఆడిషన్ ఇవ్వమన్నారట. తీరా ఆడిషన్ ఇచ్చాక, ఆమె నటన బాగాలేదని డైరెక్టర్ దాదాపుగా రిజెక్ట్ చేయాలనుకున్నాడు. కానీ అహాన్ పాండే (Ahaan Panday) (‘సైయారా’ హీరో) డైరెక్టర్‌ని ఒప్పించి, ఆమెకు మరో అవకాశం ఇవ్వమని కోరాడట. కట్‌చేస్తే.. డిస్టింక్షన్‌లో పాస్ అయ్యింది. అనీత్ ఆడిషన్‌కు వేసుకెళ్లిన డ్రెస్ లుక్‌నే సినిమాలో పెట్టారు.సినిమాల్లోకి రావాలని చిన్నతనం నుంచే కలలు కనేదట. తల్లి ప్రోత్సాహంతో తనకు ఇష్టమైన నటనా రంగాన్ని ఎంచుకుంది. మొదట మోడలింగ్‌లోకి అడుగుపెట్టి నెస్ కెఫే, క్యాడ్‌బరీ, మ్యాగీ, పేటిఎం, అమెజాన్ లాంటి వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది.
మూడేళ్ల క్రితం రూపొందిన ‘క్యాడ్‌బరీ’ యాడ్‌తో బాగా పాపులరైంది. 2022లో కాజోల్ ప్రధానపాత్రగా వచ్చిన ‘సలామ్ వెంకీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. గతేడాది ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. బోర్డింగ్ స్కూల్ డ్రామాగా సాగే ఈ సిరీస్‌లో ‘రూహీ’ అనే పాత్రలో రెబల్ గాళ్‌గా కనిపించి, అందరినీ ఆకట్టుకుంది అనీత్. తాజాగా ‘సైయారా’ సక్సెస్ కావడంతో ఆ యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనీత్‌కు ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆ సమయంలో గిటారు వాయిస్తూ, తనలోని గాయనిని బయటకు తెస్తుంది. రోడ్ సైడ్ ఫుడ్‌ను తెగ ఇష్టపడుతుంది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ అనీత్ దిట్టే. మంచి సింగర్ కూడా. గతేడాది ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ కోసం ‘మాసూమ్’ పాటను తనే రాసి, తనే కంపోజ్ చేసి పాడింది.
ఎప్పటికీ మర్చిపోలేని తన చిన్ననాటి జ్ఞాపకం గురించి ప్రస్తావిస్తూ... స్కూల్‌లో జరిగిన ఒక నాటకం కోసం తన కనుబొమలను, కనురెప్పలను కత్తిరించుకున్నట్లు తెలిపింది. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ సాహసంగానే అనిపిస్తుందట. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ సుందరి తన సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్ పంచుకుంటుంది. ‘సైయారా’ సినిమాకు ముందు ఈ బ్యూటీని ఇన్‌స్టాగ్రామ్‌లో 30 వేల మంది ఫాలో అయితే.. సినిమా విడుదలైన తర్వాత ఆ సంఖ్య 20 లక్షలకు చేరింది. వారిలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం.