Ufff Yeh Siyapaa: అనుష్క భాగమతి దర్శకుడి.. హిందీ మూకీ చిత్రం! థియేటర్లకు ఎప్పుడంటే
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:27 PM
సైలెంట్ చిత్రాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మన దేశంలో కమల్ నటించిన పుష్పక విమానము తర్వాత ఆ తరహాలో మరో చిత్రం ఏనాడు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు.
మనకు సైలెంట్ చిత్రాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మన దేశంలో కమల్ నటించిన పుష్పక విమానము తర్వాత ఆ తరహాలో మరో చిత్రం ఏనాడు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడా వెలితిని పూడ్చేందుకు అన్నట్టుగా బాలీవుడ్‌లో ఉఫ్ఫ్ యే సియాపా (Ufff Yeh Siyapaa) చిత్రం తెరకెక్కింది. సినిమా మొత్తం ఒక్క మాటా (ఎలాంటి డైలాగ్స్) లేకుండా కేవలం సంగీతం ప్రధాన భూమిక పోషిస్తూ ఈ చిత్రం రూపొందింది. అది కూడా యాక్షన్, సస్పెన్స్, హాస్యాన్ని ఇలా నాలుగైదు జానర్లను మిక్స్ చేసి తెరకెక్కించిన డార్క్ కామెడీ మూవీ అవడం విశేషం.
తెలుగులో పిల్ల జమిందార్, సుకుమారుడు, భాగమతి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీ అశోక్ (G.Ashok) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సోహమ్ షా (Sohum Shah), నుష్రత్ భరుచా (Nushrratt Bharuccha), నోరా ఫతేహి (Nora Fatehi), ఓంకార్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. అస్కార్ విన్నర్ రెహామాన్ (A.R. Rahman) సంగీతం అందించడం గమనార్హం. కేవలం నటీనటుల పెర్ఫార్మెన్స్, ఆపై ప్రతి సన్నివేశంలో సస్పెన్స్, కామెడీ, మలుపులతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది.
కథ విషయానికి వస్తే.. ఒక అమాయకుడు అయిన కేసరి లాల్ సింగ్ (సోహమ్ షా), భార్య పుష్ప (నుష్రత్ భరుచా)తో హాయిగా జీవితం వెళ్లదీస్తుంటాడు. అయితే ఓ రోజు తన భర్త కేసరి పొరుగింటి కామిని (నోరా ఫతేహి)తో ఏదో సంబంధం ఉందని అనుమానించి వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సమయంలో తన ఇంటికి తప్పుగా వచ్చిన డ్రగ్స్ పార్శిల్ కోసం ఇద్దరు అగంతకులు ఆ ఇంటికి వస్తారు. ఈ విషయం తెలియకుండానే కేసరి చేసిన ఒకట్రెండు పనుల వళ్ల తనకు తెలియకుండానే ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతారు. అది చూసి షాకైన కేసరి ఆ శవాన్ని పడేసి ఇంటికొచ్చే సరికి మరో మృతవేహం కనిపిస్తుంది.
సరిగ్గా అప్పుడే పోలీస్ ఇన్‌స్పెక్టర్ హస్ముఖ్ (ఓంకార్ కపూర్) రంగంలోకి దిగుతాడు. కావలాని కేసరిని మరింత ఇబ్బందుల్లోకి నెడతాడు. ఈ నేపథ్యంలో అతను హీరో ఎలా బయట పడ్డాడు, అ ఇంట్లోకి వచ్చిన వారు ఎలా చనిపోయారనే ఆసక్తికరమైన కథకథనాలతో మంచి థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ సినిమా సాగుతుంది. సినిమా చూసే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి అనందించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న దేశ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.