Dhurandhar: ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ దర్జాగా..
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:58 AM
రణ్‌వీర్ సింగ్ (Ranveer singh) హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ (Dhurandhar) . ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని నిజంగా ఎవరూ ఊహించలేదు.
రణ్‌వీర్ సింగ్ (Ranveer singh) హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ (Dhurandhar) . ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని నిజంగా ఎవరూ ఊహించలేదు. రిలీజ్‌కు ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, ఈ స్థాయి అసాధారణ విజయం దక్కుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. సినిమా విడుదలైన క్షణం నుంచీ బాక్సాఫీస్ వద్ద దురంధర్ స్వైర విహారం చేస్తోంది. ఈ సినిమాకు ప్రధాన బలం రణ్‌వీర్ సింగ్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, దర్శకుడు ఆదిత్య ధర్ పదునైన కథా కథనం. తొలి రోజు నుంచే కళ్లు చెదిరే వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం, అనేక ఏరియాల్లో హౌస్‌ఫుల్ బోర్డులను చూసింది. కేవలం కమర్షియల్ హంగులు తోడు, ఈ సినిమాలో చూపించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాయి.
దురంధర్ ప్రయాణం ఒక సునామీలా కొనసాగుతుంది. ఈ ఏడాది టాప్ లిస్ట్‌లో నిలిచిన సైయారా, ఛావా, కాంతార చాప్టర్-1 లాంటి భారీ చిత్రాల పేర్ల మీదున్న ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ, తాజాగా 900 కోట్ల క్లబ్‌లోకి దర్జాగా అడుగుపెట్టింది. దేశీయ మార్కెట్లలో ఇప్పటికే తిరుగులేని వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఇంకా విదేశీ మార్కెట్‌లో కూడా తన ప్రభావాన్ని చూపుతూ భారతీయ సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా, కొన్ని ఇస్లాం కంట్రీస్‌లో ఈ సినిమాపై బ్యాన్ నడుస్తున్నా కూడా ఓవర్సీస్‌లో ఈ సినిమా దూకుడు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. దురంధర్ సినిమా విజయం గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్న ప్రధాన అంశం, ఇది ఒక A-రేటెడ్ సర్టిఫికెట్ పొందిన చిత్రం కావడం. సాధారణంగా, మనకు తెలిసిన లెక్కల ప్రకారం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకునే సినిమాలకు మాత్రమే 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంటుంది. అయితే, దురంధర్ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. రణ్‌వీర్ సింగ్ ఇంటెన్స్ నటన, అలాగే ఆదిత్య ధర్ దర్శకత్వం ప్రతిభ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలనకున్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్‌కు ఇది ఇబ్బంది కలిగించేలా ఉందని, తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలను ఆపివేసారని టాక్ వినిపిస్తుంది. ఇక దురంధర్ సీక్వెల్ కూడా వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దురంధర్ సీక్వెల్‌ను మాత్రం హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దురంధర్ విజయం ఒకటే నిరూపించింది A-రేటెడ్ సినిమా అయినా సరే, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు దానికి కచ్చితంగా పట్టం కడతారని.