Manoj bajpayee: ఆర్జీవీ.. నాకు జీవితం ఇచ్చాడు! ఇప్పుడు చూసే వర్మ 2.0.. భారత సినిమాలో కొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తాడు
ABN , Publish Date - Nov 23 , 2025 | 10:46 AM
‘సత్య’ నా నట జీవితాన్ని మలుపు తిప్పిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాము విషయానికి వస్తే- ఆయన నాకు మార్గదర్శిలాంటివాడు. నాకు వృత్తిజీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి.
హిందీ సినిమాలు.. ఓటీటీలపై ఆసక్తి ఉన్నవారికి పరిచయం అవసరం లేని నటుడు మనోజ్ బాజ్‌పేయ్ (Manoj Bajpayee). సినీ రంగంలో విభిన్నమైన నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న మనోజ్ నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మూడో సీజన్ (Family Man 3) అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూ.
‘ఫ్యామిలీ మ్యాన్’ కొత్త సీజన్‌కు రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా బావుంది. శుక్రవారం విడుదలయిన దగ్గర నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అనూహ్యం. గత మూడు రోజులుగా ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో ఉన్నాం. ఇంకా చూడనివారు అనేక ఉంది ఉన్నారు. వారి స్పందన కూడా త్వరలో తెలుస్తుంది.
‘ఫ్యామిలీ మ్యాన్ తొలి సీజన్ విడుదలయినప్పుడు- ఆ సిరీస్ అంత హిట్ అవుతుందని అనుకున్నారా?
అనుకోలేదు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెబుతాను. నేను ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ లలో నటించినప్పుడు అది హిట్ అవుతుందా లేదా అనే విషయాన్ని ఆలోచించను. ఆ పాత్ర నాకు నచ్చిందా లేదా అనే విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటా. ‘ఫ్యామిలీ మ్యాన్’లో నా పాత్ర నాకు చాలా నచ్చింది. అయితే ఈ సిరీస్ ఇంత విజయం సాధిస్తుందనే విషయం మాకు తెలియదు. చాలా మంది ప్రేక్షకులు- దీనిని ఒక సిరీస్ గా చూడటంలేదు. వారి జీవితాల్లో ఒక భాగంగా చూస్తున్నారు. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలుగా భావిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి ఈ తరహా స్పందన రావటం చాలా అరుదు. ఏదో ఒక శక్తి మాకు సాయం చేయకపోతే ఇలాంటి విజయం లభించదు.
ఈ మధ్యనే ‘సత్య’ సినిమా రీరిలీజ్ కూడా అయింది. వెనక్కి తిరిగి చూస్తే ఎలా అనిపిస్తోంది?
‘సత్య’ నా నట జీవితాన్ని మలుపు తిప్పిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాము విషయానికి వస్తే- ఆయన నాకు మార్గదర్శిలాంటివాడు. నాకు వృత్తిజీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి. ఒక నటుడిగా నన్ను ఎలా ఉపయోగించుకోవాలో రాముకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు మళ్లీ రాముతో కలిపి ఒక కొత్త సినిమా చేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయాన్ని పంచుకోవాలి. ఒకప్పటికి ఇప్పటికీ రాములో ఒక పరివర్తన వచ్చింది. రాము 2.0 కొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తాడనుకుంటున్నా. బహుశా అలాంటి మ్యాజిక్ మన భారతీయ సినీ రంగంలో జరిగి ఉండదు.

మీరు ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో అత్యంత క్లిష్టమైనది ఏది?
ప్రతి పాత్రా కష్టమైనదే! ఎందుకంటే సాధారణమైన పాత్రలు చేయటానికి నేను ఇష్టపడను. నాకు సవాల్ విసిరే పాత్రల్లో నటించినటానికే ప్రాధాన్యత ఇస్తాను. నా నట జీవితం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి దాకా నేను ఇలాగే ఉన్నా! ఈ క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం నాకొక సరదా! అదే నా జీవన విధానం.
మీ స్క్రిప్ట్ ఎలా ఎంపిక చేసుకుంటారు?
నిజం చెప్పనా! నేను పెద్దగా ఆలోచించి పాత్రలను ఎంపిక చేసుకోను. నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ లు వింటూ ఉంటా. హఠాత్తుగా ఒక కథ నచ్చుతుంది. అది మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉంటుంది. అలాంటి సినిమాలు చేస్తా!
ఒక నటుడిగా మీకు సమాజంలో వస్తున్న మార్పులు ఎలా తెలుస్తూ ఉంటాయి?
నేను విపరీతంగా పుస్తకాలు.. పేపర్లు.. మ్యాగిజైన్లు చదువుతాను. నా చుట్టూ ఉన్న సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటా. అంటే నేను ఏదో పనిగట్టుకొని ఈ పని చేస్తానని కాదు. ఇదంతా నా జీవితంలో ఒక భాగం.

ప్రస్తుతం మన సమాజంలో వస్తున్న మార్పులపై మీ అభిప్రాయం?
ప్రస్తుతం యువతీయువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారి అభిప్రాయాలు.. అభిరుచులు.. భావోద్వేగాలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో అనేక సంఘర్షణలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి వీటిని ఒడిసిపట్టుకోవటం చాలా కష్టం. అయితే ఒక నటుడికి వీటన్నింటి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
మీరు బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. ప్రాంతీయ భాషా సినిమాలు ఎందుకు చేయటం లేదు?
గతంలో చేశాను. నాలుగు తెలుగు సినిమాలు.. రెండు తమిళ సినిమాలు చేశాను. అయితే నాకు ఈ భాషలు రావు. భాష తెలియనప్పుడు భావోద్వేగాలు సరిగ్గా పలకవు. అందువల్లే నేను ప్రాంతీయ భాషల్లో ఎక్కువగా నటించటం లేదు. ఇక మీరు ‘బాలీవుడ్’ అన్నారు. నా ఉద్దేశంలో బాలీవుడ్ వేరు. హిందీ సినిమాలు వేరు. నేను హిందీ సినిమాల్లో నటిస్తాను. కమర్షియల్ సినిమాల్లో తక్కువ నటిస్తాను. అందువల్ల నేను బాలీవుడ్ నటుడిని కూడా కాదు.
ఓటీటీలపై మీ అభిప్రాయమేమిటి? వీటి వల్ల ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందా?
గత నాలుగైదు ఏళ్లుగా ఓటీటీ ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు సినిమా నిర్మాణంపై కూడా దీని ప్రభావం పడుతోంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగా సినిమాలు తీయాల్సిన బాధ్యత డైరక్టర్లపై పడుతోంది. అంతే కాకుండా- దేనిని ఓటీటీలలో చూడాలి.. దేనిని థియేటర్లలో చూడాలనే విషయంలో ప్రేక్షకులు స్పష్టమైన అంచనాలకు వస్తున్నారు. ఈ కోణం నుంచి చూస్తే- నిర్మాతలకు ఓటీటీలు సవాల్ విసురుతున్నట్లే!