Bollywood: ఆరంభంలో ‘ఛావా’.. చివర్లో ‘దురంధర్’! బాలీవుడ్‌కు.. కొత్త ఊపిరి
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:39 AM
అగ్ర హీరోలు నటించిన సినిమాలే మొదటి, రెండు వారాల్లోనే వసూళ్లు రాబట్టలేక బాక్సాఫీసు దగ్గర చతికిల పడుతుంటే, రిలీజ్ అయి మాసం అవుతున్నా బాలీవుడ్ చిత్రం ‘దురంధర్’ వసూళ్ల హవా కొనసాగుతోంది.
అగ్ర హీరోలు నటించిన సినిమాలే మొదటి, రెండు వారాల్లోనే వసూళ్లు రాబట్టలేక బాక్సాఫీసు దగ్గర చతికిల పడుతుంటే, బాలీవుడ్ చిత్రం ‘దురంధర్’ (Dhurandhar) వసూళ్ల హవా కొనసాగుతోంది. ‘వార్ వన్ సైడే’ అన్నట్లు మూడు వారాల తర్వాత కూడా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే రూ.800 కోట్ల బెంచ్ మార్క్‌ను ‘దురంధర్’ దాటేసింది. ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.852.27 కోట్లు వసూలు చేసి కాంతార చాప్టర్ వన్ చిత్రం ముందు వరుసలో ఉంది.
ఇప్పుడు ఆ రికార్డ్‌ను ‘దురంధర్’ 25 రోజుల్లోనే అధిగమించి ప్రపంచ వ్యాప్తంగా రూ. 1113.75 కోట్లు వసూలు చేసి ఈ యేటి హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ కలెక్షన్లు చూస్తుంటే ‘ఓటీటీల ప్రభావం పెరిగింది.. జనం థియేటర్లకు రావడం మానుకున్నారు’ అని ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న కామెంట్లు తప్పేమో అనిపిస్తుంది ‘దురంధర్’ను చూడడానికి థియేటర్లకు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని చూస్తుంటే. ‘అవతార్ 3’ ను మించి ఈ సినిమాకు కలెక్షన్లు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదే జోరు మరో రెండు వారాలు కొనసాగితే, రూ. 1500 కోట్లు కూడా దాటటం పెద్ద కష్టమేమీ కాదు అనేలా ఉంది.

ఆ ఐదు చిత్రాల్లో ఒకటి
ఇదిలాఉంటే.. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక, దక్షిణాది చిత్రాల పోటీని తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్న హిందీ చిత్ర పరిశ్రమకు 2025 ఆరంభంలో వచ్చిన ‘ఛావా’ (Chhaava) చిత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మరాఠా యోధుడు శంభాజీ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ సంవత్సరంలో తొలి సూపర్‌హిట్‌ను అందించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఛావా’ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇందులో హీరోగా నటించిన విక్కీ కౌశల్ పేరు ఈ సూపర్ హిట్‌తో దేశమంతా మారు మోగిపోయింది.
ఇప్పుడు సంవత్సరం చివరిలో వచ్చిన ‘దురంధర్’ చిత్రం కూడా ఘన విజయం సాధించడంలో 2025కు ఉత్సాహంతో వీడ్కొలు పలకడానికి బాలీవుడ్ సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలో రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు ఐదు మాత్రమే ఉన్నాయి. వాటిల్లో ‘దురంధర్’ చిత్రం మొదటి వరుసలో నిలిచింది. మిగిలిన నాలుగు సినిమాలు .. ‘కాంతారా చాప్టర్ 1’ (రూ. 850 కోట్లు), ఛావా (రూ 797 కోట్లు), సయారా (రూ. 579 కోట్లు), రజనీకాంత్ ‘కూలీ’ (రూ. 514 కోట్లు) మాత్రమే ఉన్నాయి. తెలుగు.
రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లో..
భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకూ రూ. వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలు ఎనిమిదే ఎనిమిది ఉన్నాయి. వాటిల్లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి నాలుగు సినిమాలు ఉండడం మనం కాలర్ ఎగరేయాల్సిన విషయం. ఆ చిత్రాలు.. ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కల్కి’. బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు .. దంగల్, పఠాన్, జవాన్ ఉన్నాయి. ఇక కన్నడ నుంచి ఒకే ఒక్క సినిమా ‘కేజీఎఫ్ 2’ ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘దురంధర్’ మీదే ఉంది. ఈ చిత్రం అతి త్వరలోనే రూ.1000 కోట్లు వసూలు చేసే సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పుడు పై లిస్టులో తొమ్మిదో సినిమాగా ‘దురంధర్’ చేరుతుంది. దాంతో టాలీవుడ్ నాలుగు చిత్రాలతో, బాలీవుడ్ కూడా నాలుగు చిత్రాలతో సమాన స్థాయిలో రూ. 1000 కోట్ల క్లబ్‌లో ఉన్నట్లు అవుతుంది. అలాగే అతి తక్కువ సమయంలోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ హీరోగా రణవీర్‌సింగ్ చరిత్రలో నిలిచిపోతారు. పదిహేనేళ్ల నటజీవితంలో అతను సాధించిన గొప్ప రికార్డే అవుతుంది.
వర్మ ప్రశంసలు
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా బాలీవుడ్ ప్రముఖులకు ఓ చురక అంటించారు. ఐటెమ్ సాంగ్స్, భారీ గ్రాఫిక్స్ మీద ఆధారపడుతూ సినిమాలు తీసే దర్శకనిర్మాతలను ‘దురంధర్’ చిత్రం ఓ పీడకలలా వెంటాడుతుందని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.