Shah Rukh Khan: టికెట్ ధర రూ. 100 లోపే..

ABN , Publish Date - May 02 , 2025 | 04:56 PM

థియేటర్ల మనుగడపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండటంతో పాటు టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలని ఇచ్చిన సలహా ఆలోచింపజేస్తోంది.

ఆషాడం, దసరా, దీపావళి ఆఫర్స్‌లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్న నినాదం ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సైతం పాకింది. వస్త్ర దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో ఈ తరహా ఆఫర్స్‌ను చూసుంటాం. కానీ సినిమా థియేటర్లలోనూ ఇలాంటి బోర్డులు కనిపించడం షాకిస్తోంది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అంటూ... టికెట్ ధర 99 రూపాయలకే అంటూ రిలీజ్ కు ముందు మేకర్స్ అనౌన్స్ చేస్తూ జనాన్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేక్షకులు థియేటర్ల వైపు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇందుకు కారణం పెరిగిన టికెట్ ధరలు,కంటెంట్ లేని సినిమాలు! పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పటికి... ఫ్యామిలీతో కలిసి చూసేందుకు జంకుతున్నారు. ఈ ఈ విషయమై.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.


ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ (Waves Summit) లో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్న కింగ్ ఖాన్... అంతకు మించి అనేలా చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు విశేష చర్చకు దారితీశాయి. మూవీ లవర్స్ ను సినిమా థియేటర్లకు రప్పించేలా ఓ సూపర్ ఐడియాను షేర్ చేసుకున్నాడు షారుఖ్‌. మొన్నటి వరకు కంటెంట్ ఉన్న సినిమాలకే పెద్ద పీట వేశారు జనం. టికెట్ రెట్లు పెరిగినా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపారు. కానీ ఇప్పుడు అదే సమస్యగా మారుతోంది. ఫ్యామిలీతో కలిసి మల్టీప్లెక్సులకు వస్తే... టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. పైగా ఓటీటీ, పైరసీ వల్ల జనం థియేటర్లకు రావడం మానేశారు. దీంతో మేకర్స్ మూవీ లవర్స్ ను థియేటర్లకు రప్పించేందుకు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షేర్ చేసుకున్న ఓ ఐడియా ఆలోచింపజేసేలా కనిపిస్తోంది.


ప్రతి ఊరిలో చీప్ థియేటర్లు ఉండాలని.. వాటిలో భాషతో సంబంధం లేకుండా భారతీయ చిత్రాలను ప్రదర్శించాలని, టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని వివరించాడు షారుఖ్‌ ఖాన్. పుష్ప (Pushpa), ఆర్ఆర్ఆర్ (RRR), కల్కి (Kalki) లాంటి పాన్ ఇండియా మూవీలకు ఓ రేంజ్ లో టికెట్ ధరలు పెంచుతున్నారు మేకర్స్. ఇదే ఫార్ములాను టైర్ 2 హీరోలకు కూడా అప్లై చేస్తున్నారని, అయితే హీరోల ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని రేట్లు పెంచుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఇలా ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచితే జనం థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపరని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. షారుక్ చెప్పినట్లు టికెట్ ధర వంద లోపే ఉంటే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించే నిర్మాతలు... వారం పది రోజుల్లో మొత్తం రాబట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి మేకర్స్ కు ఈ కాన్పెప్ట్ నచ్చకపోవచ్చు కానీ సినిమాను బ్రతికించాలనుకునే వారు ఈ చీప్ థియేటర్స్ ఆలోచనకు జైకొట్టే ఆస్కారం లేకపోలేదు.

Updated Date - May 02 , 2025 | 04:56 PM