Boney Kapoor: ‘మామ్‌’ కోసం శ్రీదేవి చాలా చేసిందంటూ బోనీ భావోద్వేగం..

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:43 PM

తాజాగా బోనీ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మామ్‌’ కోసం శ్రీదేవి ఎంతో కష్టపడిందని భావోద్వేగానికి గురయ్యారు.


అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) నటించిన చివరి చిత్రం ‘మామ్‌’ (Mom movie). రవి ఉద్యవర్‌ దర్శకత్వంలో బోనీ కపూర్‌ నిర్మించిన చిత్రమిది. బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించిన ఈ చిత్రం షూటింగ్‌ రోజులను తాజాగా బోనీ కపూర్‌ (Boney Kapoor) ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘మామ్‌’ కోసం శ్రీదేవి ఎంతో కష్టపడిందని భావోద్వేగానికి గురయ్యారు.

‘శ్రీదేవి బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు ఆమె హిందీ మాట్లాడటం రాదు. మొదటి ఆరు సినిమాలకు వేరే వాళ్లు డబ్బింగ్‌ చెప్పారు. ఆ తర్వాత ఆమె స్వయంగా డబ్బింగ్‌ థియేటర్‌లో హిందీ పాఠాలు నేర్చుకొని తన సినిమాలకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టింది. తన చివరి చిత్రం ‘మామ్‌’ కోసం ఎంతో డెడికేటింగ్‌గా నటించింది. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లకు స్వయంగా ఆమె డబ్బింగ్‌ చెప్పింది. మలయాళం పనులను దగ్గరుండి చూసుకుంది. అలాంటి నిబద్థత చాలా తక్కువమంది నటుల్లో ఉంటుంది’ అని బోనీకపూర్‌ శ్రీదేవిపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మామ్‌ కోసం శ్రీదేవి రెమ్యునరేషన్‌లో కొంత వదులుకున్నారని బోనీ కపూర్‌ తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఏఆర్‌ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. ఇండస్ట్రీలో ఉన్న కాస్ట్‌లీ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో రెహమాన్‌ ఒకరు కావడంతో మేం ఆలోచనలో పడ్డాం. అప్పుడు శ్రీదేవి తన రెమ్యునరేషన్‌లో రూ.70 లక్షలు ఆయనకు ఇవ్వాలని చెప్పింది.  దీంతో మా బడ్జెట్‌ కష్ట తక్కువైంది. పని సులువైంది’ అని అన్నారు.


ఆ సినిమా షూటింగ్‌లో సమయంలో తను ఒంటరిగా ఉండేది. రూమ్‌ షేర్‌ చేసుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు. పాత్రపై పూర్తిగా దృష్టిపెట్టాలి, మైండ్‌ డైవర్ట్‌ కాకుండా ఉండాలంటే ఒంటరిగానే ఉండాలనేది. నోయిడా, జార్జియాలో షూటింగ్‌ జరిగే సమయంలోనూ రూమ్‌లో తాను ఒంటరిగా ఉండేది. ఎప్పుడూ స్ర్కిప్ట్‌ ప్రాక్టీస్‌ చేసుకునేది’ అని అన్నారు. ‘మామ్‌’ సినిమా 2017లో విడుదలైంది. నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందకొచ్చి బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుంది. రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.175 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. 2018లో శ్రీదేవి మరణించింది.
  

Updated Date - Sep 08 , 2025 | 03:47 PM