Bollywood: శిల్పాశెట్టి దంపతులకు కోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Oct 09 , 2025 | 08:29 AM
శిల్పాశెట్టి దంపతుల లాస్ ఏంజెల్స్ టూర్ కాన్సిల్ అవుతోంది. విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళడానికి అనుమతి కోరుతూ, తమపై ఉన్న లుక్ అవుట్ ఆర్డర్ ను రద్దు చేయమని వీరు ముంబై కోర్టు తలుపు తట్టగా, అక్కడ చుక్కెదురైంది.
ప్రముఖ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty), ఆమె భర్త రాజ్ కుంద్రా (Raj Kundar) కు మరోసారి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. గత కొన్నేళ్ళుగా రాజ్ కుంద్రా వివిధ కేసులలో కోర్టు గుమ్మం తొక్కుతూనే ఉన్నారు. వ్యాపారంలో భాగస్వాములను మోసం చేసిన కేసులోనూ, పోర్న్ వెబ్ సైట్స్ ను నిర్వహించిన కేసులోనూ ఆయన నిందితుడుగా ఉన్నారు. ఇదే సమయంలో ఓ వ్యాపారవేత్తను 60 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో బాంబే హైకోర్ట్ శిల్పాశెట్టి దంపతుల పిటీషన్ ను తిరస్కరించింది. తమ ఇద్దరినీ విశ్రాంతి కోసం విదేశీ పర్యటనలకు అనుమతించాలని శిల్పాశెట్టి దంపతులు బాంబే హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. దానిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అన్ ఖండ్ వారి పిటీషన్ ను కొట్టివేశారు. ఒకవేళ విదేశీ పర్యటనకు వెళ్ళాలని అనుకుంటే, రూ. 60 కోట్లను డిపాజిట్ చేయాలని తెలిపారు. ఈ ఆదేశాలను పాటించిన తర్వాతే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
ఆగస్ట్ 14న దీపక్ కఠారీ అనే వ్యాపారవేత్త శిల్పాశెట్టి దంపతులపై కేసు పెట్టారు. పెట్టుబడి పేరుతో తన దగ్గర రూ. 60 కోట్లు తీసుకుని వ్యక్తిగత అవసరాలకు వారు వాడుకున్నారని కోర్టుకెక్కాడు. దీంతో దంపతులిద్దరిపై ముంబాయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వీరు కోర్టుకు వెళ్ళారు.