Saiyaara: కుర్రాళ్ల దెబ్బ.. బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ! ఛావా రికార్డులు మటాష్
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:32 PM
మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా చిత్రం సయ్యారా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.
మోహిత్ సూరి (Mohit Suri) దర్శకత్వంలో తెరకెక్కి గత వారం థియేటర్లలోకి వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా చిత్రం సయ్యారా (Saiyaara) విడుదలైన అన్ని చోట్లా సంచలనం సృష్టిస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాతో బాలీవుడ్ అలనాటి నటుడు చుంకీపాండే తనయుడు, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనన్యా పాండే సోదరుడు అహాన్ పాండే (Ahaan Panday), హీరోగా అనీత్ పద్దా (Aneet Padda) హీరోయిన్‌గా హిందీ తెరకు పరిచయం అయ్యారు.
అయితే.. అంతా కొత్త వారితో తీసిన ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే ₹100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మూవీలో హీరో, హీరోయిన్ల మధ్య కుదిరిన అద్భుతమైన కెమిస్ట్రీ, మనసును హత్తుకునే పాటలు, ఎమోషనల్ టచ్, సినిమా రిలీజ్ కు ముందే పాటలతో దేశవ్యాప్తంగా క్రియేట్ అయిన హైప్ అన్నీ కలిసి ఈ సినిమాను పీక్స్‌కి తీసుకెళ్లాయి. అంతేగాక సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్, వారి వీడియోలు వైరల్ అయి మరింతగా కలెక్షన్లు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా విడుదలైన నాలుగో రోజు మాములుగా అయితే కలెక్షన్లు సగానిక పడి పోతుంటాయి.. కానీ ఈ సినిమా విషయంలో సీన్ రివర్స్ అయి సోమవారం ఒక్క రోజే రూ.24.25 కోట్లు నెట్ వసూలు చేసి మేకర్స్‌నే ఖంగు తినేలా చేసింది. అంతేకాదు ఈ కలెక్షన్లు.. సినిమా రిలీజ్ రోజు శుక్రవారం వచ్చిన ఓపెనింగ్స్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
పైపెచ్చు ఇటీవల వచ్చిన హౌస్‌ఫుల్ 5, రైడ్ 2, సితారే జమీన్ పర్, చావా వంటి బ్లాక్‌బస్టర్ల సోమవారం రికార్డులనూ దాటేసింది. దాంతో 2025లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా ‘సయ్యారా’ రికార్డు సృష్టించింది. ఇంకా లాంగ్ రన్ ఉండడంతో మున్ముందు ఈ చిత్రం ఇంకా మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశముందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కొత్త నటీనటులతో ఇంత భారీ రికార్డు క్రియేట్ చేయడం హిస్టరీలో నిలిచిపోయే విషయం.