Ceasefire: కాల్పుల విరమణపై హర్షం
ABN , Publish Date - May 10 , 2025 | 08:19 PM
భారత్, పాక్ కాల్పుల విరమణ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పోరుతో శత్రువులు, ఎవరో మిత్రులు ఎవరో తెలిసిందని రవీనా టాండన్ వ్యాఖ్యానించడం విశేషం.
ఇండియా, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉత్కంఠ భరిత పరిస్థితికి తెర పడింది. అమెరికా అధ్యక్షుడి కోరిక మేరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారాన్ని తెలిపాయి. భారత ప్రభుత్వం నుండి ఈ సమాచారం అధికారికంగా రాగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. యుద్థమేఘాలు తొలుగుతున్నాయనే వార్త వారిలో ఆనందాన్ని నింపింది. బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా భారత్ చేసిన ప్రకటన పట్ల హర్షం వెలిబుచ్చారు. సీజ్ ఫైర్ నిర్ణయాన్ని పలువురు సినీ ప్రముఖులు స్వాగతించారు. కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), వరుణ్ ధావన్ (Varun Dhawan), కరన్ జోహార్, అనన్య పాండే (Ananya Panday), పరిణితీ చోప్రా (Parineeti Chopra) తదితరులు ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరిచారు. అలానే త్రిప్తి డిమ్రీ, స్వర భాస్కర్, మల్లికా అరోరా సైతం తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న వారికి మన నాయకులు ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటారో ఈ పాటికి అర్థమై ఉంటుందని శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలతో ఈ దేశానికి శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో తెలిసిందని, మరింత జాగరుకతతో మనం వ్యవహరించాల్సి ఉందని ప్రముఖ నటి రవీనా టాండన్ (Raveena Tandon) తెలిపింది. ఇంకోసారి భారత్ పై టెర్రరిస్టులు దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించింది. భావోద్వేగంతో రవీనా టాండన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.