Govardhan Asrani: చనిపోయే.. కొన్ని గంటల ముందు! అస్రాని.. చివరి మాటలివే
ABN , Publish Date - Oct 22 , 2025 | 08:28 AM
ఉత్తరాది ప్రేక్షకులను తన నటనతో కడుపుబ్బా నవ్వించిన నవ్వుల నవాబు గోవర్ధన్ అస్రాని(84) జైలర్ సాబ్ ఇక లేరు అని తెలియగానే బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.
ఉత్తరాది ప్రేక్షకులను తన నటనతో కడుపుబ్బా నవ్వించిన నవ్వుల నవాబు గోవర్ధన్ అస్రాని(84) (Govardhan Asrani) కన్నుమూశారు. ‘షోలే’లో కోట్లాది మందిని తన సహజ సిద్ధమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న జైలర్ సాబ్ ఇక లేరు అని తెలియగానే బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. అస్రాని నిష్క్రమణతో ఓ శకం ముగిసిందని సినీ అభిమానులు, ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన అస్రాని, సోమవారం చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అస్రాని చనిపోయే కొన్ని గంటల ముందు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘నా అంతక్రియలకు ఎవ్వరినీ పిలిచి ఇబ్బంది పెట్టొద్దు, నేను ఒక కామన్‌మ్యాన్ గానే వెళ్లిపోవాలి’ అని భార్య మంజు అస్రానితో ఆయన చెప్పారట.
మలుపు తిప్పిన ‘షోలే’
1941లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు గోవర్థన్ అస్రాని. సినిమా నటుడు కావాలనే ఆశయంతో కెరీర్ ఆరంభంలో పలు గుజరాతీ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు అస్రాని. ఆ తర్వాత ముంబైకి చేరుకుని పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు. ‘హరే కాంచ్ కి ఛుడియాన్’ ఆయన మొదటి హిందీ సినిమా. ‘సత్యకం’, ‘గుడ్డి’ సినిమాలు ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘షోలే’ సినిమాలో అస్రాని చేసిన జైలర్ పాత్ర ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ సినిమాలో అస్రాని చెప్పిన పలు సంభాషణలను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకోవడం విశేషం. ఈ జైలర్ పాత్రను హాలీవుడ్ కమెడియన్ ఛార్లీ ఛాప్లిన్ స్ఫూర్తితో తయారు చేసినట్లు ఆ చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పీ ఓ సందర్భంలో తెలిపారు. ‘అభిమాన్’, ‘ఛోటీ సీ బాత్’, ‘నమక్ హరామ్’ వంటి చిత్రాల్లో ఆయన నటనను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.
కమెడియన్‌గా మెప్పిస్తూనే అన్ని రకాల పాత్రల్లో నటించారు. 1975లో విడుదలైన ‘ఛైతాలి’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రనూ పోషించారు. దర్శకుడు ప్రియదర్శన్‌తో ఆయన ‘హేరా ఫేరీ’, ‘చుప్ చుప్ కే’, ‘గరం మసాలా’ వంటి చిత్రాలు చేశారు. ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో అస్రాని నటిస్తున్న ‘హైవాన్’, ‘భూత్ బంగ్లా’ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆయన నటించిన ఏకైక తెలుగు చిత్రం మహేశ్‌బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’ కావడం విశేషం. దర్శకుడుగా పలు సినిమాలు తెరకెక్కించారు. 1973లో ‘ఆజ్ కీ తాజా’ సినిమా సెట్స్‌లో సహ నటి మంజుతో ప్రేమలో పడి, ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు లేరు.