Box Office Collection: 3 నెలలు.. 8 సినిమాలు.. రూ.1100 కోట్లు!

ABN , Publish Date - Jul 24 , 2025 | 05:32 AM

బాలీవుడ్‌ బాక్సాఫీసు ఇప్పుడు కలెక్షన్లతో కళకళలాడుతోంది. సరైన హిట్‌ లేకపోవడం

బాలీవుడ్‌ బాక్సాఫీసు ఇప్పుడు కలెక్షన్లతో కళకళలాడుతోంది. సరైన హిట్‌ లేకపోవడం, దక్షిణాది సినిమా తొడ కొట్టి వరుస విజయాలు సాధించడం, అగ్ర హీరోలు సైతం తమ ఉనికి చాటుకోవడానికి ఇబ్బంది పడుతుండడం.. ఇత్యాది కారణాల వల్ల నీరసించి పోయిన హిందీ సినిమా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ముఖ్యంగా మూడు నెలల నుంచి వస్తున్న వరుస విజయాలు బాలీవుడ్‌కి కొత్త జోష్‌ నిచ్చాయి. ఈ తొంభై రోజుల్లో విడుదలైన ఏడు సినిమాలు ప్రజాదరణతో దూసుకుపోతుండడం, తాజాగా ‘సైయారా’ చిత్రం విడుదలైన ఐదు రోజల్లో రూ. 150 కోట్లు వసూలు చేయడం.. బాలీవుడ్‌ శుభ సూచకంగా భావిస్తోంది. ‘కొవిడ్‌’కు పూర్వం ఉన్న పరిస్థితులు మళ్లీ తిరిగొచ్చాయని సంబరపడుతోంది. ‘జాట్‌’, ‘కేసరి 2’, ‘రైడ్‌ 2’, ‘హౌస్‌ఫుల్‌ 5’, ‘సితారే జమీన్‌ పర్‌’, ‘మా’, ‘మెట్రో ఇన్‌ డినో’, ‘సైయారా’... ఈ ఎనిమిది సినిమాలు ఇప్పటి వరకూ వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా?.. రూ. 1150 కోట్లు. వీటిల్లో ‘హౌస్‌ఫుల్‌ 5’, ‘సితారే జమీన్‌ పర్‌’, ‘రైడ్‌ 2’ చిత్రాలు ఒక్కొక్కటీ రూ. 165 కోట్లు వసూలు చేశాయి. ఇక తెలుగు నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్‌, పీపుల్‌ మీడియా సంయుక్తంగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నిర్మించిన ‘జాట్‌’ చిత్రం, జలియన్‌వాలా బాగ్‌ హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాటం చేసిన న్యాయవాది శంకరన్‌ నాయర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘కేసరి 2’ చిత్రం రూ. 90 కోట్ల చొప్పున వసూలు చేసి పరవాలేదనిపించుకున్నాయి. అనురాగ్‌ బసు రూపొందించిన ‘మెట్రో ఇన్‌ డినో’ రూ. 52 కోట్లు, తన భార్య కాజోల్‌ ప్రధాన పాత్రధారణిగా అజయ్‌ దేవగణ్‌ నిర్మించిన ‘మా’ చిత్రం రూ. 35 కోట్లు వసూలు చేసి సరిపెట్టుకున్నాయి.


FGJ.jpgదూసుకుపోతున్న ‘సైయారా’

ఈ చిత్రాలన్నీ ఒక ఎత్తయితే ‘సైయారా’ సినిమా విజయం మరో ఎత్తు అని సినీ పండితులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న హారర్‌, యాక్షన్‌ ట్రెండ్‌లో ఈ రొమాంటిక్‌ సెన్సిబుల్‌ లవ్‌స్టోరీని ఎవరు చూస్తారని హేళనగా మాట్లాడిన వారే ‘సైయారా’ చిత్రం కలెక్షన్లు చూసి నివ్వెర పోతున్నారు. కుర్రకారుతో థియేటర్లు నిండిపోతున్నాయి. సినిమా చూసి యువతరం ఎంజాయ్‌ చేస్తోంది. చిత్రంలో నటించిన కొత్త జంట అహాన్‌ పాండే, అనీత్‌ పడ్డా మధ్య కెమిస్ట్రీ కుదిరిందని ఆడియన్స్‌ కితాబు ఇచ్చేస్తున్నారు. నిజంగా ‘సైయారా’ చిత్ర విజయం ఓ అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు మోహిత్‌ సూరి ఈ కథను పట్టుకుని చాలా మంది నిర్మాతల చుట్టూ తిరిగారు. ఎవరూ ముందుకు రాలేదు. చివరకు అక్షయ్‌ విధాని అనే నిర్మాత సినిమా తీయడానికి అంగీకరించారు. అయితే అతను వర్ధమాన నిర్మాత. ఆర్ధిక వనరులు అంతంత మాత్రమే. పైగా డిస్ట్రిబ్యూటర్స్‌ సపోర్ట్‌ లేదు. అవి రెండూ లేకుండా సినిమా తీయడం కష్టమని భావించిన దర్శకుడు మోహిత్‌ సూరి యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ అధినేత ఆదిత్య చోప్రాను కలిశారు. సాయం చేయమని అభ్యర్ధించారు. ‘ఆషికి 2’ చిత్రం ఛాయలు కొన్ని కనిపించినప్పటికీ ఇప్పటి యూత్‌ ఆడియన్స్‌ మిస్‌ అవుతున్న మ్యూజిక్‌, సెన్సిబుల్‌ లవ్‌ ‘సైయారా’లో ఉన్నాయని, బాగా తీస్తే ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారని ఆదిత్య చోప్రాకు అనిపించింది. అందుకే తను అండగా ఉంటానని మాట ఇవ్వడంతో మోహిత్‌ సూరి పంట పండినట్లయింది. చివరకు ఆదిత్య చోప్రా నమ్మకమే నిజమైంది. ‘సైయారా’ చిత్రం చూసి థియేటర్లలో యువతరం ఊగిపోతోంది. వారం తిరగకుండానే ఓ చిన్న సినిమా రూ. 150 కోట్లు వసూలు చేసిందంటే ఫుల్‌ రన్‌లో రూ. 500 కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్‌ పండితులు. ‘సైయారా’ కు వస్తున్న రెస్పాన్స్‌ చూసి ఖుష్‌ అయిన ఆదిత్య చోప్రా ‘వార్‌ 2’ చిత్రం వచ్చే వరకూ ఈ సినిమాను కంటిన్యూ చేయమని తన పంపిణీదారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం.

GHKJMH.jpg

Updated Date - Jul 24 , 2025 | 05:32 AM