Girija oak: 20 ఏళ్లలో రాణి గుర్తింపు.. ఒక్క ఇంటర్వ్యూలో ..
ABN , Publish Date - Dec 07 , 2025 | 02:28 PM
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీలి రంగు చీరలోని గిరిజా ఓక్ (38) ఫొటోలే. ఈ నటికి 20 ఏళ్లుగా రాని గుర్తింపు ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వచ్చేసింది. దాంతో ఓవర్‌నైట్‌లో ట్రెండింగ్ స్టార్ అయిపోయింది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీలి రంగు చీరలోని గిరిజా ఓక్ (38) ఫొటోలే. ఈ నటికి 20 ఏళ్లుగా రాని గుర్తింపు ఒకే ఒక్క ఇంటర్వ్యూతో వచ్చేసింది. దాంతో ఓవర్‌నైట్‌లో ట్రెండింగ్ స్టార్ అయిపోయింది. నెట్‌లో ఆమె గురించి సెర్చింగ్ ఎక్కువయ్యింది. ఇటీవల తనకు వచ్చిన క్రేజ్ చూసి షాక్ అవుతోన్న ఈ మరాఠీ భామ ఏమంటోందంటే...
పదిహేనేళ్లకే సినిమాల్లోకి...
1987లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టా. ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి బయోటెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశా. మా నాన్నగారు గిరీశ్ ఓక్ ప్రముఖ మరాఠీ నటుడు. ఆయన్ని చూస్తూ పెరగడం వల్ల తెలియకుండా నాకూ నటనపై ఆసక్తి కలిగింది. చిన్నతనంలో బోలెడు నాటక ప్రదర్శనలు ఇచ్చా. 15 ఏళ్ల వయసులో ‘మానినీ’ అనే మరాఠీ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టా. తర్వాత ఆమిర్‌ఖాన్ ‘తారే జమీన్ పర్’తో బాలీవుడ్‌కి వెళ్లా.
సీరియల్స్ నుంచి వెబ్ దాకా...
నన్ను బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది క్రైం ఇన్వెస్టిగేషన్ సీరియల్ ‘సీఐడీ’. అందులో స్వప్న పాత్రలో కనిపించా. ఆ తర్వాత ‘లేడీస్ స్పెషల్’, ‘మోడ్రన్ లవ్ ముంబై’, ‘కర్టెల్’లో నటించా. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఇన్‌స్పెక్టర్ జెండే’లో మనోజ్ బాజ్‌పాయ్ భార్యగా చేశా. అంతేకాదు ‘షోర్ ఇన్ ది సిటీ’లో సందీప్ కిషన్‌తో కలిసి కొన్ని సీన్స్‌లో కనిపించా. ఈ లిస్టులో షారుక్ ఖాన్ ‘జవాన్’ కూడా ఉంది.

పాటలు పాడతా...
నాకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రాణం. ఆ మక్కువతోనే తరచూ రేడియోల్లో పాటలు వినేదాన్ని. టీవీలో సంగీత కార్యక్రమాల్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఎక్కడ సంగీత ప్రదర్శనలు జరిగినా వెళ్లేదాన్ని. విభిన్న శైలిలో పాటలు ఎలా పాడాలో చూసి నేర్చుకున్నా. మరాఠీలోని ‘సింగింగ్ స్టార్’లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచా.
ఆయన అభిమానిని...
నేను విజయ్ సేతుపతికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన వర్కింగ్ స్టైల్ నాకెంతో నచ్చుతుంది. ‘జవాన్‘ షూటింగ్ సెట్లో డైరెక్టర్ అట్లీ పుట్టినరోజు వేడుక సందర్భంగా మొదటిసారి ఆయన్ని కలిశా. అతడ్ని చూడగానే కొన్ని క్షణాలపాటు నోటంట మాట రాలేదు. తర్వాత తేరుకుని నా అభిమానాన్ని వ్యక్తపరిచా. ఆయన సింపుల్‌గా నవ్వి ‘థ్యాంక్యూ’ అన్నారు. విజయ్‌తో మాట్లాడాక ఆయనపై నా అభిమానం రెట్టింపయ్యింది.

అంతా మావారి వల్లే...
మావారు సుహ్రుద్ గోడ్బోలే దర్శక నిర్మాత. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. 2011లో మా పెళ్లి జరిగింది. నిజానికి ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఇప్పటికీ నటిస్తున్నా. మాకొక బాబు. రోజంతా ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం వాడితో గడపకపోతే నాకు మనసొప్పదు. అటు వృత్తిని, ఇటు ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నా.
భయమేస్తోంది...
ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా నేనిచ్చిన ఇంటర్‌వ్యూ వైరల్‌గా మారింది. ఆ తర్వాతే నేను ట్రెండింగ్‌లోకి వచ్చా. సోషల్ మీడియాలో నా ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. ఇక్కడే నాకు భయమేస్తోంది. ఎందుకంటే నాకొక కొడుకున్నాడు. పెద్దయ్యాక వాటిని తను చూసి బాధపడతాడు కదా. మార్ఫింగ్ మాలాంటి వారికి (తల్లులకు) శాపమే!
ఎన్నో తిరస్కరణలు...
‘తారే జమీన్ పర్’ తర్వాత అవకాశాలు క్యూ కడతాయని ఎన్నో కలలు కన్నా. కానీ సీన్ రివర్స్ అయింది. అవకాశాల ఊసే లేదు. ఆడిషన్స్‌కి వెళ్లినా తిరస్కరణలే ఎదురయ్యేవి. ‘నువ్వు లీడ్ క్యారెక్టర్‌కు సరిపోవు’, ‘తరువాత చెబుతాం’ అనేవాళ్లు. టాలెంట్ ఉన్నా, అవకాశాలు రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యేదాన్ని. ‘జవాన్’లో హీరో పెంపుడు తల్లి (కావేరి అమ్మ) పాత్రకు మొదట నేనే ఆడిషన్ ఇచ్చా. కానీ అది రిధి డోగ్రాకు వెళ్లింది. అందుకే చివరి నిమిషంలో ఆ సినిమాలో మరో పాత్ర చేయాల్సి వచ్చింది.