Babil Vs Sai rajesh: బాలీవుడ్ బాబిల్ వివాదం.. సాయిరాజేశ్ ఫైర్
ABN, Publish Date - May 05 , 2025 | 12:11 PM
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ (babil khan) పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అతని తీరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ (babil khan) పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అతని తీరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బాలీవుడ్ తీరుపై మండిపడుతు అతను వదిలిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అతని టీమ్ క్లారిటీ ఇచ్చింది. బాబిల్‌ను అందకూ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ వీడియోలో ఉన్న నటీనటులు అందరి నుంచి అతను స్ఫూర్తి పొందాడని ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా, బాబిల్ ఖాన్ టీమ్ ఇచ్చిన క్లారిటీపై తెలుగు దర్శకుడు సాయి రాజేశ్ 9Sai rajesh Fire) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘‘మీరు ఏం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చోడానికి మేము ఏమైనా పిచ్చోళ్లలాగా కనిపిస్తున్నామా? వీడియోలో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్లు అయితే.. ఇంతకాలం అతడికి సపోర్ట్‌గా నిలిచిన మేమంతా పిచ్చివాళ్లమా? ఒక గంట ముందు వరకూ అతడికి సపోర్ట్‌గా నిలవాలనుకున్నా. ఇప్పుడు మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడం మంచిదనిపిస్తుంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు. మీరు నిజాయతీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన రాసుకొచ్చారు. దీనిపై బాబిల్ ఖాన్ స్పందించాడు. ‘‘మీరు నా మనసుని ముక్కలు చేశారు. మీకోసం నేను ఎంతో శ్రమించా. మీ సినిమాలోని పాత్రకు న్యాయం చేయడం కోసం రెండేళ్లు కష్టపడ్డా. ఇతర అవకాశాలను వదులుకున్నా’’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌లు వైరల్ కావడంతో ఇరువురు తమ పోస్ట్‌లను డిలీట్ చేశారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆదివారం బాబిల్ బాలీవుడ్‌ను ఎండగడుతూ ఓ పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు మీ అందరితో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఈ పరిశ్రమలో అర్జున్, అనన్య, షనయాతోపాటు పరిశ్రమతో సంబంధం లేకుండా బయట నుంచి వచ్చిన అర్జిత్ సింగ్ వంటి వారు చాలామంది ఉన్నారు. ఈ ఇండస్ర్టీ ఎంతో అమర్యాదకరంగా ఉంటుంది. నేను చూసిన వాటిల్లో అత్యంత నకిలీ పరిశ్రమ ఇదే. ఇండస్ర్టీ బాగుండాలని కోరుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారు. నేను మీకు ఎన్నో విషయాలను తెలియజేయాలనుకుంటున్నా’’ అంటూ బాబిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసి.. కొద్దిసేపటికే డిలీట్ చేశాడు. తన ఇన్‌స్టా ఖాతాను డీ యాక్టివేట్ చేశాడు. బేబీతో హిట్ అందుకున్నా సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని హిందీలో తీయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో బాబిల్‌ను హీరోగా ఎంచుకోనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.