Amir Khan: హీరోలకే కాదు.. వారికి పారితోషికాలు పెంచాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:12 PM
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) తాజాగా సినీ పరిశ్రమలో ఒక పెద్ద చర్చకు తెర లేపాడు.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) తాజాగా సినీ పరిశ్రమలో ఒక పెద్ద చర్చకు తెర లేపాడు. ఓ సినిమా రూపొందడానికి నటీనటులు మాత్రమే కాకుండా, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరూ సమానంగా శ్రమిస్తారని, అందుకే వారికి ఇచ్చే పారితోషికాల విషయాల్లోనూ సమన్యాయ సూత్రం పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సినిమా విజయానికి ప్రధాన కారణం కేవలం హీరో మాత్రమే కాదని, కథను రాసే రచయిత, సినిమాను ముందుకు నడిపించే దర్శకుడు కూడా సమాన స్థాయిలో గౌరవం పొందాలని అమీర్ అన్నారు. ఇందు కోసం పాయింట్ల సిస్టమ్‌ను తీసుకురావాలని, సినిమా లాభాలను అందరి శ్రమను బట్టి పంచుకోవాలని సూచించారు.
ఎడిటింగ్ నుంచి సినిమాటోగ్రఫీ వరకు, ప్రతి విభాగంలో శ్రమించే టెక్నీషియన్స్ తమ వంతు కష్టానికి తగ్గ గుర్తింపు, న్యాయమైన బహుమతి అందుకోవాలని అమీర్ అభిప్రాయపడ్డారు. ఒకే ఒక్క హీరో లేదా నిర్మాత వద్ద లాభం కేంద్రీకృతమై పోకుండా, సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ వాటా రావాలనే కోణంలో అమీర్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇది కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ సహా అన్ని భారతీయ చిత్ర పరిశ్రమలలో ఇది అమలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇకపై తన నిర్మాణ సంస్థల్లో స్వయంగా ఈ విధానాన్ని అమలు చేస్తానని కూడా అమీర్ ప్రకటించారు. ఇలా చేస్తేనే రచయితలకు సరైన గౌరవం లభించి, కొత్త కథలు పుడతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.సరై కథలు, టెక్నీషియన్ లేకుండా తీసిన సినిమాలు ఎంత డబ్బు వెచ్చించినా విఫలం అవుతాయన్నారు.