AI Film Hackathon: దేశంలో మొట్ట మొదటి సారి.. ఏఐ చలనచిత్రోత్సవాలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:25 AM
భారతదేశంలో తొలిసారిగా పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందిన సినిమాల చలనచిత్రోత్సవం ముంబైలో జరగనుంది.
ఇప్పటివరకూ మనం ఎన్నో చలనచిత్రోత్సవాలను చూశాం. త్వరలో పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపొందిన సినిమాలతో ఓ చలనచిత్రోత్సవం (Film Festival) జరగనుంది. ఈ కార్యక్రమానికి ముంబై వేదిక కాబోతోంది. ఇండియాలోనే అతి పెద్ద ఏఐ ఫిల్మ్ హ్యాకథాన్ (AI Film Hackathon) ఈ నెల 31 నుంచి నవంబర్ 2 వరకూ మూడు రోజుల పాటు జరగనుంది.
లోకల్ హోస్ట్ (Local Host) అనే సంస్థ నిర్వహిస్తోన్న ఈ పోటీలో భారతదేశం నలుమూలల నుంచీ, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 మంది విడివిడిగా, బృందాలుగా పాల్గొంటారు. పోటీదారులు 48 గంటల్లో ఏఐ సాయంతో లఘు చిత్రాలను రూపొందించాల్సి ఉంటుంది. జోయా అక్తర్, కునాల్ కపూర్, షాకూన్ బాత్రా లాంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు. విజేతలకు పురస్కారాలతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

నవంబర్ 2న రాయల్ ఒపేరా హౌస్‌లో రెడ్ కార్పెట్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి, ఏఐ చిత్రాల ప్రీమియర్ స్ర్కీనింగ్, అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీ నటులు, సాంకేతిక నిపుణులు హాజరవనున్నారు. ఏఐ సాయంతో ఎవరైనా తమ కథను సినిమాగా మలచవచ్చు, ఒక సినిమాకు అవసరమైన కథను, కథనాన్ని అభివృద్ధి చేయడానికి ఏఐ టూల్స్‌ను ఎంత వినూత్నంగా, ప్రభావవంతంగా ఉపయోగించుకోగలం అనేది తెలుసుకోవడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశం అని లోకల్ హోస్ట్ సంస్థ తెలిపింది.