Aamir Khan: 'మహాభారతం'లో ఆ పాత్ర చేయాలనుకుంటున్నా
ABN , Publish Date - May 08 , 2025 | 03:37 PM
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి మరోసారి మాట్లాడారు. ఆ సినిమాలో ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారో తొలిసారి వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ (Aamir Khan) తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ (Mahabharata) గురించి మరోసారి మాట్లాడారు. ఆ సినిమాలో ఏ పాత్ర పోషించాలనుకుంటున్నారో తొలిసారి వెల్లడించారు. దాంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నలిచి ట్రెండ్ అవుతోంది. ‘‘మహాభారతం’ను తెరకెక్కించడం నా కల. దీనికోసం ఎంతో కష్టపడాలి. కానీ ఇలాంటి సినిమాలు ఎప్పటికీ నిరాశపరచవు. ఇందులో కృష్ణుడి (Sri Krishna) పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నాకు ఇష్టమైన పాత్ర అది. ఆ క్యారెక్టర్‌లో కనిపించాలని ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. దీని గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. సమయం వచ్చినప్పుడు అదే పట్టాలెక్కుతుంది’’ అన్నారు. గతంలోనూ ఆమిర్ ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభించే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈకథ రైటింగ్‌కు కొన్ని సంవత్సరాలు పడుతుందన్నారు. ఒక్క పార్టులో ఈ సినిమాను చెప్పలేమని సిరీస్‌లుగా తెరకెక్కించి విడుదల చేయాలనుకుంటున్నామని అప్పట్లో అన్నారు.
అనంతరం మరికొన్ని ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. తాను నటించిన ఎన్నో సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోలేదన్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’కూ రెమ్యునరేషన్ తీసుకోలేదని చెప్పారు. ‘‘నా సినిమాలకు వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటాను. సినిమా హిట్ అయితేనే నాకు పేమెంట్ వస్తుంది. లేకపోతే ఏం ఉండదు. ‘లాల్ సింగ్ చడ్డా’కు నాకు రూపాయి కూడా అందలేదు. అయినా ఆ విషయంలో బాధపడను. ఎందుకంటే ఇలా చేయడం సరైనదని నా అభిప్రాయం. సినిమా ఫ్లాప్ విషయంలో నేను కూడా బాధ్యత వహించాలనేది నా ఆలోచన. ‘షూటింగ్‌లో నేను ఇన్ని రోజులు పాల్గొన్నాను కాబట్టి.. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. నా పారితోషికం నాకు ఇవ్వండి’ అని నిర్మాతలను అడగలేను. నేను అలాంటి నటుడిని కాదు’’ అని ఆమిర్‌ఖాన్ అన్నారు.