రాజమౌళి సినిమాకి మహేష్ బాబు లుక్ ఇదేనా?

ABN , Publish Date - Feb 05 , 2024 | 12:02 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు వారాలపాటు జర్మనీ లో ప్రత్యేకంగా వ్యాయమ శిక్షణ తీసుకొని హైదరాబాదు తిరిగి వచ్చేసారు. ఎయిర్ పోర్టులో మహేష్ బాబు బయటకు వచ్చినప్పుడు అతని లుక్ చూసి బాగుందని ఇది రాజమౌళి సినిమా కోసమే అని అంటున్నారు, ఆ లుక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

రాజమౌళి సినిమాకి మహేష్ బాబు లుక్ ఇదేనా?
Mahesh Babu and SS Rajamouli

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజుల క్రితం జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. తన తదుపరి సినిమా దర్శకుడు రాజమౌళితో చేస్తున్న మహేష్ బాబు, ఆ సినిమా కోసమని కొన్ని రోజులు వ్యాయామంలో శిక్షణ తీసుకోవడానికి జర్మనీ వెళ్లారని ఒక టాక్ నడిచింది. అయితే అక్కడ శిక్షణ ముగించుకొని ఇప్పుడు సూపర్ స్టార్ హైదరాబాదు తిరిగి చేరుకున్నారు.

మహేష్ బాబు తాజా సినిమా 'గుంటూరు కారం' సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందన వచ్చినా, తరువాత కలెక్షన్స్ లో పుంజుకొని మహేష్ బాబు ఖాతాలో ఒక ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుంది అని అంటున్నారు. ఈ సినిమాకి కావాలని కొంతమంది నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని పరిశ్రమలో ఒక టాక్ కూడా నడించింది. అయితే ఎంత నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా, సినిమా కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకీ పుంజుకున్నాయని, ఈ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అయిందని చెపుతున్నారు. కానీ ఈ సినిమా విడుదలైన తరువాత చిత్ర నిర్వాహకులు విజయోత్సవ సభ జరపలేదు. అదొక్కటే మహేష్ బాబు అభిమానులకు కొంచెం నిరాశ పరిచింది.

maheshbabunewlookone.jpg

అయితే ఇప్పుడు మహేష్ బాబు తిరిగి హైదరాబాదు రావటంతో ఎయిర్ పోర్టులో అతన్ని చూసిన వారంతా అతని లుక్ చూసి బాగుందని అంటున్నారు. అయితే ఇది రాజమౌళి సినిమా కోసం అతని కొత్త లుక్ అని కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ వ్యాయామ శిక్షణ మూడు వారల పాటు మహేష్ బాబు చేశారు. ఇప్పుడు మహేష్ బాబు కొత్త లుక్ సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మహేష్, రాజమౌళి సినిమా బడ్జెట్ భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ పెట్టి తీసే చిత్రంగా ఉంటుందని, ఇందులో పాన్ ఇండియన్ నటులతో పాటు, హాలీవుడ్ కి చెందిన నటీనటులు కూడా ఉంటారని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా నేపధ్యం కూడా అడ్వెంచర్ తరహాలో ఉంటుందని అంటున్నారు. రాజమౌళి తండ్రి, సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా సమాచారం బయట పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, సినిమా నటీనటులు ఎంపిక, షూటింగ్ త్వరలోనే జరుగుతుందని కూడా అంటున్నారు.

Updated Date - Feb 05 , 2024 | 12:02 PM