మహేష్ బాబు విదేశీ ప్రయాణం అందుకోసమేనా?

ABN , Publish Date - Jan 19 , 2024 | 10:32 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న హైదరాబాద్ విమానాశ్రయంలో కనపడటం, ఈసారి కుటుంబ సభ్యులు లేకుండా ఒక్కరే ప్రయాణం చెయ్యడం చూస్తుంటే ఈ పర్యటన అందుకోసమే అని ఒక వార్త వినపడుతోంది. ఇంతకీ అతను ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అంటే...

మహేష్ బాబు విదేశీ ప్రయాణం అందుకోసమేనా?
Mahesh Babu and Namrata Shirodkar at airport

సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణం అవుతూ కనిపించారు. ఈసారి ఆసక్తికర అంశం ఏంటంటే, మహేష్ బాబు ఎప్పుడు ప్రయాణం అయినా అతని కుటుంబ సభ్యులతో వెళుతూ వుంటారు, కానీ ఈసారి అతను ఒక్కరే విమానాశ్రయంలో కనిపించారు. ఆయన భార్య నమ్రత విమానాశ్రయంలో భర్తకి వీడ్కోలు పలికారు. ఈమధ్య కాలంలో మహేష్ బాబు ఇలా ఒక్కరే ప్రయాణం చేయడం ఆయన అభిమానులను కాస్త ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇంతకీ మహేష్ బాబు ప్రయాణం తన తదుపరి రాజమౌళితో చేయబోయే సినిమా కోసం అని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తన సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పని చేస్తారు, అందులో భాగంగానే మహేష్ బాబు వెళుతున్నారు అని తెలిసింది. ఇంతకు ముందు 'ఆర్ఆర్ఆర్' సినిమాకి కూడా రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరినీ విదేశాలకి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి సరిపోయే విధంగా కొన్ని సాంకేతిక పనులు చేసిన విషయం తెలిసిందే. (Mahesh Babu left Germany to do some technical things for his upcoming film with director SS Rajamouli)

rajamouli-mahesh.jpg

ఈసారి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి కూడా రాజమౌళి చాలా ప్రీ ప్రొడక్షన్ పని చేస్తున్నారని, అందులో భాగంగానే మహేష్ బాబుని జర్మనీ తీసుకువెళుతున్నారనీ, అక్కడ ఆయనకి సరిపోయే విధంగా కొన్ని సాంకేతిక విషయాలు చర్చించడానికి అని అంటున్నారు. మహేష్ బాబుతో తీయబోయే సినిమా ఒక అడ్వెంచర్ లా వుండబోతోంది అని, దక్షిణాఫ్రికాతో సహా చాలా దేశాల్లో ఆ సినిమా షూటింగ్ జరగబోతోంది అని ఇప్పటికే వార్తలు వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే.

అలాగే ఈ సినిమాకి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని, ఇది భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ పెట్టి తీసే మొదటి సినిమా అవుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు విదేశీ పర్యటన కాస్త ఆసక్తికరంగా మారడం సహజమే అని అంటున్నారు. మూడు రోజులపాటు మహేష్ బాబు పర్యటన ఉంటుందని, హైదరాబాద్ వచ్చాక తన తాజా సినిమా 'గుంటూరు కారం' విజయోత్సవ సభ ఉంటుందని ఒక టాక్ నడుస్తోంది.

Updated Date - Jan 19 , 2024 | 10:52 AM