Vyooham: రామ్ గోపాల్ వర్మకి ఇంకో షాక్, అక్కడే తేల్చుకోమన్న హైకోర్టు

ABN , Publish Date - Jan 03 , 2024 | 02:32 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి షాక్ ల మీద షాక్ తగులుతోంది. నా 'వ్యూహం' సినిమాని ఆపలేరు డిసెంబర్ 29న విడుదల చేస్తున్నాను అన్న ఆర్జీవికి మొదటి షాక్ సినిమా విడుదల ఆగిపోవటం. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత సినిమా విడుదల ఆగిపోవడంతో కోట్లలో నష్టం వస్తోందని హై కోర్టులో పిటిషన్ వేస్తే, అక్కడే తేల్చుకోండి అని హైకోర్టు చెప్పింది. ఇది వర్మకి మరో షాక్....

Vyooham: రామ్ గోపాల్ వర్మకి ఇంకో షాక్, అక్కడే తేల్చుకోమన్న హైకోర్టు
Controversial director Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వివాదాస్పద రాజకీయ చిత్రం 'వ్యూహం' విడుదల ఇప్పట్లో లేనట్టే కనపడుతోంది. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉండగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈ సినిమాలో తన తండ్రి ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఈ సినిమా విడుదలని నిలిపి వేస్తూ జనవరి 11 వరకు విడుదల చెయ్యొద్దని ఉత్తర్వులు ఇచ్చింది.

దీనితో వర్మకి పెద్ద షాక్ తగిలింది. నా 'వ్యూహం' సినిమాని ఎవరూ ఆపలేరు డిసెంబర్ 29న విడుదల చేస్తున్నాను అన్న వర్మకి ఒక పెద్ద షాక్ అయింది. 'వ్యూహం' సినిమాలో వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని వర్మ చెపుతున్నా, ఇందులో తెలుగు దేశం నాయకులను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఒక విలన్ గా చిత్రీకరించాడు వర్మ అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీ నాయకులను కూడా కించపరిచే విధంగా చిత్రీకరించాడు వర్మ అని తెలుస్తోంది.

9rgv.jpg

ఈ సినిమా నిర్మాత దాసరి కిరణ్ వైస్సార్సీపీకి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. రామ్ గోపాల్ వర్మ పలు మీడియా సమావేశాల్లో ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి పాత్రలాంటివి ఉన్నాయని పదే పదే చెపుతూ వస్తున్నారు. వర్మ సినిమాలో కంటెంట్ గానీ, విషయం గానీ ఉండదు, కానీ ప్రచారం మాత్రం ఎక్కువ చేస్తారు. ఈ 'వ్యూహం' సినిమాకి కూడా తన సామజిక మాధ్యమైన ట్విట్టర్ లో తెలుగు దేశం నాయకుల పేర్లు వుపయోగించి బాగా ప్రచారం చేసుకున్నారు అని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత ఈ పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు వలన సినిమా విడుదల నిలిచిపోయిందని, అందువలన కోట్లలో నష్టం వస్తోందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే సింగల్ బెంచి తదుపరి విచారణని ఈనెల 11కి వేసిందని కూడా తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, సింగిల్ బెంచీలోనే ఈ విషయాన్నీ తేల్చుకోవాలని పిటిషనర్ కి స్పష్టం చేశారు.

Updated Date - Jan 03 , 2024 | 02:37 PM