బెంగాలీ సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మాజీ

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:17 PM

తెలుగులో విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ, ఇప్పుడు మొదటిసారిగా ఒక బెంగాలీ సినిమాలో నటిస్తున్నారు

బెంగాలీ సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మాజీ
Brahmaji

తెలుగు పరిశ్రమలో వున్న అతి కొద్దిమంది క్యారెక్టర్ నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. కమెడియన్ అయినా, సీరియస్ పాత్ర అయినా, ఇంకెటువంటిదైనా తనదైన రీతిలో ఆ పాత్రలో ఇమిడిపోయి ప్రేక్షకులని మెప్పించగల ధీటైన నటుడు బ్రహ్మాజీ. అతను ఈమధ్య పాన్ ఇండియా సినిమా 'సలార్' లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా పాన్ ఇండియా సినిమాలో కనపడుతూ అందరి ప్రేక్షకులకు దగ్గరవుతున్న బ్రహ్మాజీ ఇప్పుడు ఒక బెంగాలీ సినిమాలో నటిస్తుండటం విశేషం.

brahmajichiranjeevi.jpg

బ్రహ్మాజీ బెంగాలీ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నటించిన బ్రహ్మాజీ ఇప్పుడు బెంగాలీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమని బ్రహ్మాజీ భువనేశ్వర్ వెళ్లినట్టుగా సమాచారం. సుమారు మూడు దశాబ్దాలకి పైగా చిత్రపరిశ్రమలో ఉంటూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకొని, ఒక్క వివాదంలో కూడా లేకుండా పరిశ్రమలో అందరితో కలుపుకుపోయే వ్యక్తిగా బ్రహ్మాజీకి మంచి పేరుంది. ఇప్పుడు బెంగాలీ సినిమాలో మొదటిసారిగా నటించడం బ్రహ్మాజీ కెరీర్ లో ఒక మైలురాయిగా చెప్పొచ్చు.

ఈ బెంగాలీ సినిమాలో అతను ఒక పోలీసాఫీసర్ పాత్రలో కనపడనున్నట్టుగా తెలిసింది. ఈ సినిమాకి రక్తిమ్ ఛటర్జీ నిర్మాత కాగా, ఎంఎన్ రాజ్ (MN Rajh) దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒరిస్సాలోని కటక్ లో జరుగుతోంది. 'సలార్' సినిమాలో బ్రహ్మాజీ చేసిన పాత్రని చూసి ఈ బెంగాలీ చిత్ర నిర్వాహకులు ఈ సినిమాకోసం మాట్లాడి వొప్పించినట్టుగా తెలిసింది.

Updated Date - Feb 03 , 2024 | 04:17 PM