Dil Raju: సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లకి ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:42 PM
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో ఎటువంటి చర్చలు జరిగాయో ఆయన తెలిపారు. ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లకి ఏం సూచించారంటే..
‘పుష్ప 2’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన టాలీవుడ్‌కు మాయని మచ్చగా మారింది. ఈ ఘటనని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో.. అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకు మధ్య వివాదం మొదలైనట్లుగా వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి, ఇండస్ట్రీలోని సమస్యలను తెలిపేందుకు గురువారం సినీ పెద్దలు కొందరు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేయగా.. హాజరైన పెద్దలు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అనంతరం ఈ సమావేశానికి కారణమైన తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మీడియాకు మీటింగ్ విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
Also Read-Tollywood: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం ఎంత టైమ్ ఇచ్చారంటే?
‘‘సీఎం రేవంత్ రెడ్డితో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున జరిగిన సమావేశమిది. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య FDC చైర్మన్‌గా నేను ముందు ఉండి నడిపించాను. ఇండియా లెవల్‌లో తెలుగు సినిమాకి గౌరవం ఉంది. తెలుగు సినిమాను ఇండియా లెవల్‌లో కాకుండా ప్రపంచ స్థాయిలో చూడాలని సీఎం భావించారు. ఇండస్ట్రీ కూడా సీఎం వ్యూ కు తగినట్లుగా.. ఇంటర్నేషనల్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్ జరిగేలా అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇండస్ట్రీతో చర్చించి, ఇంటర్నేషనల్ హబ్‌గా హైదరాబాద్‌ను తీసుకెళ్లాలని FDC కూడా భావిస్తుంది.
Also Read-సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..
డ్రగ్స్, మాదక ద్రవ్యాల విషయంలో కూడా మేము అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఇండస్ట్రీలోని నటీనటులతో డ్రగ్స్ నిర్మూలనపై కూడా మేము అవగాహన కల్పిస్తాం. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వంకి మధ్య గ్యాప్ ఉందని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత అలాంటి చర్చకు దారి తీసింది. ఇకపై ప్రభుత్వం మరియు ఇండస్ట్రీ కలిసి పని చేస్తాయి. ఇండస్ట్రీ, ఎఫ్‌డిసి మరియు ప్రభుత్వం కలిపి ఒక కమిటీ వేస్తారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపైన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సమావేశం ఉంటుంది. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ బ్రాండ్‌ను పెంచేందుకు ఇండస్ట్రీ తరఫున మా మద్దతు ఉంటుంది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు అనేది చాలా చిన్న విషయం. తెలంగాణ బ్రాండ్‌ను పెంచాలి, అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్‌లో షూటింగ్‌లు చేసుకునేలా చర్యలు తీసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మాకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద టాస్క్ ఇచ్చారు దాన్ని మేము రీచ్ కావాలి’’ అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.