Surekha Konidela: పప్పుచారు, వడియాలు అనగానే.. గిల్టీగా అనిపించి.. సారీ చెప్పాడట

ABN , Publish Date - Mar 08 , 2024 | 07:06 PM

తన కోడలు ఉపాసన సలహాతో 'అత్తమ్మాస్‌ కిచెన్' ప్రారంభించారు చిరంజీవి భార్య సురేఖ. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన కోడలితో కలిసి 'నవ్య'కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Surekha Konidela:  పప్పుచారు, వడియాలు అనగానే.. గిల్టీగా అనిపించి.. సారీ చెప్పాడట

తన కోడలు ఉపాసన (Upasana)సలహాతో 'అత్తమ్మాస్‌ కిచెన్' ప్రారంభించారు చిరంజీవి (Chiranjeevi) భార్య సురేఖ (Surekha). మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన కోడలితో కలిసి 'నవ్య'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓసారి షూటింగ్‌ సమయంలో చిరంజీవి, ఆయన స్నేహితుడు ప్రసాద్‌బాబుకి (Prasad Babu)మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ గురించి సురేఖ చెప్పారు.



"చిరంజీవిగారు పచ్చడి అన్నం పెట్టినా తినేస్తారు. రకరకాల వంటలు తినాలని ఆయనకు ఉండదు. కానీ ఉప్పు తక్కువైతే మాత్రం చెబుతారు. ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది. మేము మద్రాసులో కాపురం ఉండే సమయంలో ఆయన షూటింగ్స్‌లో బాగా బిజీగా ఉండేవారు. ప్రసాద్‌ బాబు, ఈయన కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఒక రోజు ఇంట్లో కూరలు లేకపోతే - పప్పు చారు పెట్టి, వడియాలు వేయించా. ఈయన అవి తినేసి షూటింగ్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం వచ్చిన తర్వాత- ‘‘ప్రసాద్‌బాబు షూటింగ్‌కి వచ్చి, వెళ్లిపోయాడు’’ అని చెప్పారు. దానికి కారణం - ఆ రోజు వాళ్లింట్లో జరిగిన గొడవట. అది కూడా కోడి గుడ్ల గురించి. ప్రసాద్‌బాబు వాళ్లావిడ కోడిగుడ్ల పులుసు పెడితే అందులో రెండు గుడ్లే వేసిందని గొడవ చేసి ప్లేటు విసిరి షూటింగ్‌కి వచ్చాడట. వచ్చి ఈయనని ఏం తిన్నావని అడిగితే - పప్పుచారు.. వడియాలు అని చెప్పారట. ఈయన ఇంత సింపుల్‌గా ఉండటం చూసి, గిల్టీగా అనిపించి. భార్యకు సారీ  చెప్పటానికి షూటింగ్‌ వదిలి వెళ్లిపోయారట. ఇలాంటి సంఘటనలు మాకు ఎన్నో ఉన్నాయి.

Mega-family-Sankranti.jpg

ఈ సంక్రాంతికి మొత్తం కుటుంబం అందరం కలిసి బెంగుళూరు వెళ్లాం. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చారు. అందరికీ కావాల్సిన వంటలన్నింటినీ ముందే ప్లాన్‌ చేసి మెనూలు పంపేశాం. పిల్లలందరూ చాలా ఎంజాయ్‌ చేశారు. నా ఉద్దేశంలో- పిల్లలు పెద్దవాళ్లను చూసి నేర్చుకుంటారు. మనం ఒక మంచి పని చేస్తే వాళ్లూ అది చేస్తారు. మొన్న పండగ చాలా సంతోషంగా గడిచింది. పిల్లలు ఆ సంతోషాన్ని అనుభవించారు కాబట్టి వాళ్లు పెద్దయిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తారు. ఆ పండుగ ఫొటోలు బాగా వైరల్‌ అయ్యాయి. మొన్న అమెరికాకు వెళ్తే చాలా మంది ఆ పండుగ గురించే ప్రస్తావించారు. తాము కూడా స్ఫూర్తి పొందామని చెప్పారు.


Updated Date - Mar 08 , 2024 | 07:06 PM