Koratala Siva: 'శ్రీమంతుడు' కథ వివాదంలో సుప్రీం ఏమందంటే..!

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:02 PM

మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’ చిత్రం. 2015లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే! అయితే, ఈ చిత్ర కథ విషయంలో వివాదం నెలకొన్న విషయమూ విధితమే.

Koratala Siva: 'శ్రీమంతుడు' కథ వివాదంలో సుప్రీం ఏమందంటే..!

మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘శ్రీమంతుడు’ 9Srimanthudu) చిత్రం. 2015లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే! అయితే, ఈ చిత్ర కథ విషయంలో వివాదం నెలకొన్న విషయమూ విధితమే. ‘శ్రీమంతుడు’ స్టోరీని ఓ పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్‌ చంద్ర గతంలో హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులోనూ దర్శకుడు కొరటాల శివకు (Koratala siva) చుక్కెదురైంది. స్థ్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్ట్‌ స్పష్టం చేసింది.

‘శ్రీమంతుడు’ కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను విచారణ సమయంలో శరత్‌ చంద్ర సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్థారిస్తూ.. రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దీంతో శివ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత రచయిత శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థ్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరపున న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే, రచయితల సంఘం నివేదిక ఆధారంగా స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. ‘పిటిషన్‌ను మమ్మల్ని డిస్మిస్‌ చేయమంటారా? లేక మీరే వెనక్కి తీసుకుంటారా’ అని న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోర్టు ప్రశ్నించగా, తామే పిటిషన్‌ వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది.

Updated Date - Jan 29 , 2024 | 05:02 PM