కొడుకులు ఇద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్, కానీ అందులో ఒకరు బెటర్ అంటున్నారు

ABN , Publish Date - Jan 02 , 2024 | 06:32 PM

సుమ కనకాల కుమారుడు రోషన్, సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు ఇద్దరూ కొన్ని రోజుల వ్యవధిలో 'బబుల్ గమ్', 'సర్కారు నౌకరి' సినిమాలతో ఆరంగేట్రం చేశారు. కానీ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికల బడ్డాయి. అయితే ఇందులో...

కొడుకులు ఇద్దరూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్, కానీ అందులో ఒకరు బెటర్ అంటున్నారు
Roshan Kanakala and Akash Goparaju made their debut in Tollywood

కేవలం కొన్ని రోజుల విరామంలో ఇద్దరు యువకుల సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి 2023 సంవత్సరం చివరి సినిమాగా 'బబుల్ గమ్' విడుదలైంది. రెండోది 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 'సర్కారీ నౌకరి' విడుదలైంది. ఈ రెండు సినిమాలకి ఒక ప్రత్యేకత వుంది. అదేంటి అంటే, 'బబుల్ గమ్' సినిమాలో సుమక్కగా అందరికీ సుపరిచితం అయిన సుమ కనకాల కుమారుడు రోషన్ కథానాయకుడుగా ఆరంగేట్రం చేసాడు. సుమ తల్లి ఈ సినిమాకి ఒక నిర్మాత కూడాను.

ఇక రెండో సినిమా 'సర్కారు నౌకరి' లో అందరికీ పరిచయం అయిన ఇంకో సెలెబ్రిటీ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. దీనికి ప్రముఖ సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్ర రావు నిర్మాత. అయితే ఈ రెండు సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి.

sumarajivkanakala.jpg

ఇక ప్రచారాల విషయానికి వస్తే, ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హైద్రాబాదులో కూర్చొని మీడియా ముందు మాట్లాడితే చాలు, అదే పెద్ద ప్రచారం అనుకుంటున్నారు. కానీ అది కేవలం కొంతవరకే పరిమితం అవుతుంది, అలాగే ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు అసలు ఈ సినిమాలగురించి తెలియదు, వివరాలు చేరవు, అక్కడ ప్రేక్షకులకి వీటిగురించి వినపడదు కూడాను.

అందుకనే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడ్డాయి. సుమ కుమారుడు నటించిన 'బబుల్ గమ్' యువతని ఆకర్షించే విధంగా కొంచెం మసాలా పెట్టి తీసిన సినిమా. ఈ సినిమాలో లిప్ లాక్ లు, మసాలా పాటలు, డాన్సులు ఇన్ని వున్నా ఆ సినిమా ఎవరికీ ఎక్కలేదు, అసలు సినిమా వచ్చినట్టే ఎవరికీ తెలియదు కూడా. ఇక 'సర్కారు నౌకరి' సినిమా ఒక అర్థవంతమైన సినిమాగా పేరు తెచ్చుకుంది. సమాజానికి ఉపయోగపడే సినిమా తీశారు అని విమర్శకులు అన్నారు తప్పితే, సినిమాలో దమ్ములేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. కానీ ఇందులో నటించిన ఆకాష్ గోపరాజు నటనకి మంచి మార్కులు వచ్చాయి. చిన్న వయసులోనే బరువైన పాత్ర పోషించాడు అని అంటున్నారు. అది సునీతకి కొంచెం సంతోషదాయకమైన వార్త అనిపిస్తుందేమో. కానీ సినిమా అయితే నడవదు.

sunithakrr.jpg

సుమ కనకాల తన కుమారుడి సినిమా కోసం పరిశ్రమలోని చాలామంది సెలబ్రెటీలను తీసుకు వచ్చారు, ప్రచారం చేయించారు. అయితే ఆ ప్రచారం అంతా ఇక్కడ హైద్రాబాదులో ఎక్కువ జరిగింది, కానీ సినిమాలో విషయం లేకపోతే ఎంతమంది ఎంత ప్రచారం చేసినా అంతే సంగతి అని పరిశ్రమలో అంటున్నారు. ఇక సునీత కుమారుడి సినిమాకి సుమక్క కుమారుడి అంత ప్రచారాలు లేకపోయినా రాఘవేంద్ర రావు లాంటి సీనియర్ దర్శకుడు, నిర్మాత ఈ సినిమా వెనకాల వుండి నడిపించారు, కానీ సినిమా నడవలేదు, సినిమాలో సమాజానికి సందేశం వుంది అని మాత్రం అన్నారు. ఇలా ఈ ఇద్దరి కుమారుల మొదటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి.

Updated Date - Jan 02 , 2024 | 06:32 PM