Srimanthudu: వివాదంపై శ్రీమంతుడు టీమ్‌ స్పందించింది!

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:28 PM

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ చిత్రంపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే! తాను రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ను కాపీ కొట్టి ఆ చిత్రాన్ని తీశారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపిస్తూ రచయిత సంఘం సహకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Srimanthudu: వివాదంపై శ్రీమంతుడు టీమ్‌ స్పందించింది!

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ చిత్రంపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే! తాను రాసిన నవల ‘చచ్చేంత ప్రేమ’ను కాపీ కొట్టి ఆ చిత్రాన్ని తీశారని రచయిత శరత్‌ చంద్ర ఆరోపిస్తూ రచయిత సంఘం సహకారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను డబ్బు ఆశించలేదని, స్ర్కిప్టు తనదేనని దర్శకుడు అంగీకరించాలని కోరారు. సినీ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారని అన్నారు. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘శ్రీమంతుడు’, ‘చచ్చేంత ప్రేమ’.. రెండూ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. వేటికవే విభిన్నం. పుస్తకం, సినిమాను పరిశీలించి ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం లీగల్‌ రివ్యూలో ఉంది. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఓపికగా వ్యవహరించండి. చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది’’ అని పేర్కొంది. 2015లో విడుదలైన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తన నవల ఆధారంగా తెరకెక్కించారంటే రచయిత శరత్‌ చంద్ర హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - Feb 01 , 2024 | 10:28 PM