Fateh: గ్లోబల్ స్టార్ వర్సెస్ పీపుల్స్ స్టార్.. మధ్యలో చిరు

ABN , Publish Date - Dec 26 , 2024 | 09:08 PM

కరోనా టైమ్‌లోనే కాకుండా ఆదుకోవాలని తన దగ్గరకు వచ్చిన వారికి.. లేదూ అనకుండా దానం చేసే గొప్ప మనసుకు వ్యక్తి సోనూసూద్. తెలుగు ప్రేక్షకులకు విలన్‌గా పరిచయమే కానీ.. ఆయన్ని విలన్‌గా చూపిస్తే.. ఇప్పుడు సినిమాలు కూడా ఆడటం లేదు. అంతగా ఆయన రియల్ హీరోగా మారిపోయాడు.

సోను సూద్ స్వీయ రచనలో జీ స్టూడియోస్ సమర్పణలో సోనూసూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) జంటగా వైభవ్ మిశ్రా (Vaibhav Mishra) దర్శకత్వంలో శాంతి సాగర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సైబర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఫతే’ (Fateh). ఈ సినిమా జనవరి 10న హిందీలో రిలీజ్ కావడానికి సిద్ధమైంది. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా అదే రోజున పాన్ ఇండియన్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీంతో హిందీలో కూడా చరణ్ కి పోటీ అనివార్యం అయ్యింది.


ఈ నేపథ్యంలో బెంగళూరు ఎయిర్ పోర్టులో చిరంజీవి, సోను సూద్ అనుకోకుండా కలిశారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే సోను తన ఫతే సినిమా చిరుకి చూపించారట. నా తరపున ఏదైన ప్రమోషన్ చేయాలా అని చిరు కూడా అడిగారట. అలాగే చరణ్ సినిమాతో పోటీ గురించి కూడా ప్రస్తావించారట. దీనికి సోను సూద్ సమాధానమిస్తూ.. తనకేం ఆందోళన లేదని, గతంలో ఒకేసారి లగాన్, గదర్ లాంటివి ఒకే రోజు రిలీజైన రికార్డులు సృష్టించాయని, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చారు.


మరోవైపు ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ.. దేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో సోనూ సూద్ ఒకరు.. అలాంటి వ్యక్తితో మేము ఈ సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేకకాదరణ పొందుతుంది. ఈ సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని తెలిపారు. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Updated Date - Dec 26 , 2024 | 09:14 PM