Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో తప్పు ఎవరిదో తేల్చేసిన పోలీసులు..

ABN, Publish Date - Dec 16 , 2024 | 07:44 PM

సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పర్మిషన్ కోరిన విషయంలో వాస్తవముందని పోలీసులు తెలిపారు. కానీ.. తాము పర్మిషన్..

Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ ఘటనలో తప్పు ఎవరిదో తేల్చేసిన పోలీసులు..

సంధ్య థియేటర్ (Sandhya Theater) ఘటన కేసులో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు (Chikkadapalli Police) మరో ట్విస్ట్‌ను రివీల్ చేశారు. డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు తాజాగా వెల్లడించారు. సినిమా హీరో, హీరోయిన్స్, చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని, అయితే తాము అందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. అయినప్పటికీ వారు వచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.


హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ షోకు వస్తే విపరీతమైన క్రౌడ్ ఉంటుందని థియేటర్ యాజమాన్యానికి తాము అప్పుడే సూచించినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. వారిని తీసుకురావొద్దంటూ యాజమాన్యానికి రాత పూర్వకంగా సమాచారం అందించినట్లు చెప్పారు. అయినా పోలీసుల మాట వినకుండా సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారని పేర్కొన్నారు. ఆయన రావడమే కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని తెలిపారు. అతన్ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్‌లోకి దూసుకెళ్లారని పోలీసులు చెప్పారు.


ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తూ రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సృహ కోల్పోయారని చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. దీంతో బాధితులకు సీపీఆర్ చేసిన అనంతరం హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి పోలీసులే తరలించినట్లు తెలిపారు. చికిత్సపొందుతూ బాధిత మహిళ రేవతి మృతిచెందినట్లు వెల్లడించారు. ఆమె మృతి గురించి తెలిసిన వెంటనే అల్లు అర్జున్‌ను థియేటర్ నుంచి తాము బయటకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.


అయితే అల్లు అర్జున్ వెళ్లేపోయే సమయంలో కారు ఎక్కి మళ్లీ ర్యాలీ ద్వారా అభిమానులకు అభివాదం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. రిమాండ్ వాదనల సమయంలోనూ ఇదే అంశాన్ని నాంపల్లి కోర్టుకు తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బన్నీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను నాంపల్లి తొమ్మిదో మెట్రోపాలిటన్ కోర్టు విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా ఆయన బయటకు వచ్చినట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 16 , 2024 | 07:44 PM