Ramoji Rao Death: భారతరత్నతో సత్కరించడమే సరైన నివాళి!

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:48 AM

మీడియా మొగల్‌గా గుర్తింపు తెచ్చు రామోజీరావు మరణం పట్ల యావత తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. సినీ రంగంలో 24 శాఖల వారు రామోజీకి సోషల్‌ మీడియా వేదికగా అశ్రునివాళులు అర్పిస్తున్నారు.

Ramoji Rao Death: భారతరత్నతో సత్కరించడమే సరైన నివాళి!

మీడియా మొగల్‌గా గుర్తింపు తెచ్చు రామోజీరావు మరణం పట్ల యావత తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి లోనైంది. సినీ రంగంలో 24 శాఖల వారు రామోజీకి సోషల్‌ మీడియా వేదికగా అశ్రునివాళులు అర్పిస్తున్నారు. రామోజీరావుతో ఎంతో అనుబంధం ఉన్న దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. రామోజీరావు మృతిపట్ల ఆయన సంతాపం తెలిపారు. తన కృషితో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.

"ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. 50 సంవత్సరాల నుంచి ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. భారతరత్నతో ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి’’ అని రాజమౌళి అన్నారు.

''రామోజీరావు గారు నిజమైన దార్శనికుడు, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి''


- నటుడు వెంకటేశ్‌

''రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నాను. ఆయన తెలివి, ధైర్యం, నాపై చెరగని ముద్ర వేశాయి. సినీ పరిశ్రమకు కూడా ఆయన ఎప్పుడూ అండగా నిలిచారు.  జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా’’

- మంచు విష్ణు

‘‘శ్రీవారికి ప్రేమలేఖ’ నుంచి ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. అమ్మ, కృష్ణగారు, జంధ్యాలగారు, రామోజీరావుగారు నాకు మానసికంగా నాలుగు స్తంభాలు. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే ఎక్కడలేని శక్తి వచ్చేది. ప్రపంచ సినిమా ఇక్కడకు తీసుకురావాలని రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మించారు. ఇండియాలో యూనివర్సల్‌ స్టూడియో నిర్మించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వాళ్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"

- సినీ నటుడు నరేష్

ra.jpeg

''బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతీయ మీడియా మరియు చిత్ర పరిశ్రమ రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దార్సనికుడు, ఎంతోమందికి ఆదర్శప్రాయుడు "రామోజీ రావు" గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్ధిస్తున్నాను!'' 

-దర్శకుడు బాబీ 

తమిళనాడు తెలుగు యువశక్తీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి రామోజీ రావుకి నివాళి అర్పించారు. ఈ మేరకు అయన ఒక ప్రకటన విడుదల చేసారు. రామోజీరావు మరణం తెలుగు సినీపరిశ్రమకు తిరని లోటని పేర్కొన్నారు. ఈనాడు గ్రూప్‌కు చైర్మన్ గా వారు తెలుగు భాష పట్ల చూపించిన  ప్రేమ ఎన్నటికీ మరువరని, నిర్మాతగా 60కి పైగా సినిమాలను నిర్మించి ఎన్ని అవార్డులను పొందారని, రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచారాని అన్నారు. దక్షిణాది చలనచిత్ర షూటింగ్లతో ఆ స్టూడియో ఎప్పుడు బిజీ గా ఉంటుందని ,అలా ఎందరో కార్మికుల కు ఆ స్టూడియో ద్వారా పని కల్పించారని చెప్పారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏ.పి .అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన ద్వారా  రామోజీరావు కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆదివారం ఉదయం 9 గంటల  నుంచి10 గంటల మధ్యలో  రామోజీ గ్రూప్స్ కేంద్ర కార్యాలయం లాన్ లో రామోజీరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు.చేస్తున్నారు కుటుంబ సభ్యులు. రామోజీరావు రావు  గతంలో ఏ కార్యక్రమం చేసినా అక్కడే నిర్వహించేందుకు ఇష్టపడేవారు. ఆయనకు ఇష్టమైన స్దలంలోనే ఇప్పుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

Updated Date - Jun 08 , 2024 | 12:26 PM