జనవరి 22న అయోధ్యకి మెగాస్టార్ కుటుంబ సభ్యులు

ABN , Publish Date - Jan 13 , 2024 | 07:22 PM

జనవరి 22న అయోధ్యలో జరిగే రాముడి విగ్రహ ప్రతిష్టాపనకి టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవికి, అతని కుమారుడు రామ్ చరణ్ కి ఆహ్వానాలు అందాయి. ఈ ఉత్సవానికి చిరంజీవి కుటుంబ సభ్యులతో హాజరవుతున్నట్టు ప్రకటించారు.

జనవరి 22న అయోధ్యకి మెగాస్టార్ కుటుంబ సభ్యులు
Ram Charan and Upasana gets invitation from Sri Rama Janmabhoomi Trust

జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది . కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసినదిగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన రెండు వేల మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తుంది శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్. ఈ ఆహ్వాన పత్రాలను ఆయా ప్రముఖులకు స్వయంగా అందజేసే బాధ్యతను విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శశిధర్ రావినూతల బృందానికి అప్పగించగా వారు ఆహ్వాన పత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. (Chiranjeevi, Ram Charan gets invitation for Ram Mandir opening on January 22 in Ayodhya from Ram Janmabhoomi Trust)

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ "అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అన్నవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను " అన్నారు.

chiranjeevigetsinvitationfr.jpg

విశ్వహిందూ పరిషత్తు నాయకులు గుర్రం సంజీవ రెడ్డి మాట్లాడుతూ "తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి ఆహ్వానాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి వారి స్వగృహానికి వెళ్లి, స్టేట్ గెస్ట్స్ గా హాజరు కావాలని కోరాము. ఈ సందర్భంగా ఆయన ఆదరంగా రిసీవ్ చేసుకోవటమే కాకుండా ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు అందుకు జరిగిన సుదీర్ఘ న్యాయపోరాట వివరాలను కూడా చెప్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. స్వయంగా ఆహ్వానం అందిస్తూ చిరంజీవి గారితో మేము గడిపిన అరగంట సమయం మాకొక ఉద్విగ్న భరిత అనుభవంగా నిలిచిపోతుంది" అన్నారు.

ఇదిలా ఉండగా ఆ రోజు రామ్ చరణ్ ఊరిలో లేని కారణంగా నిన్న ముంబై నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జాతీయ నాయకులు సునీల్ అంబేకర్ రామ్ చరణ్ ఉపాసన దంపతులను రామ విగ్రహ స్థాపన లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డు అందజేయడం జరిగింది. రాంచరణ్ కూడా ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరవుతారు.

Updated Date - Jan 13 , 2024 | 07:22 PM