తెలుగు సినిమా కలెక్షన్స్ వెనకాల ఏమైనా గూడుపుఠాణి ఉందా....

ABN , Publish Date - Jan 22 , 2024 | 05:27 PM

తెలుగు సినిమా కలెక్షన్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వున్నాయి, చర్చలు జరుగుతున్నాయి, వివాదాలు కూడా ముసురుకుంటున్నాయి. సినిమా నిర్మాత నా సినిమా కలెక్షన్స్ నాకే తెలుస్తుంది అనటం, కానీ ఆ కలెక్షన్స్ తప్పు అని కొందరు అనటం, దాని మీద చర్చలు, అసలు ఈ కలెక్షన్స్ వెనకాల ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా?

తెలుగు సినిమా కలెక్షన్స్ వెనకాల ఏమైనా గూడుపుఠాణి ఉందా....
The collection of films has now become controversial

ఈమధ్య తెలుగు సినిమా కలెక్షన్స్ ఒక పెద్ద దుమారమే లేపింది అని చెప్పొచ్చు. ఒక అగ్రనటుడు సినిమా విడుదలైతే చాలు ఆ సినిమా మొదటి రోజు నుండి ఆ సినిమా కలెక్షన్స్ మీద అందరి కళ్ళు ఉంటాయి. ఆ నటుడి అభిమానులకి కూడా మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు, వంద కోట్లు ఎప్పుడు చేసింది, వారం రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్టు చేసింది, ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఆ నటుడితో నిర్మించిన చిత్ర నిర్మాతలు సినిమా బాగుంది, బ్రహ్మాండంగా పోతోంది అని అంటారు, కానీ సామజిక మాధ్యమాల్లోనూ, అలాగే కొన్ని మీడియా వెబ్ సైట్స్ లోనూ ఇంకోలా ఉంటాయి ఆ కలెక్షన్స్ గురించి.

gunturkaaramhouseset.jpg

ఇంతకీ ఏ కలెక్షన్స్ కరెక్టు. హిందీ, ఇంగ్లీష్ సినిమాలకి రెంటల్ ట్రాక్ రికార్డు ఉంటుంది అని చెపుతున్నారు. దీనివల్ల ఆయా భాషల్లో విడుదలైన సినిమాలు ఎంత కలెక్టు చేశాయో కచ్చితంగా చెప్పొచ్చు అని అంటారు. కానీ తెలుగు సినిమాకి వచ్చేసరికి మాత్రం ఇటువంటి ట్రాక్ లేకపోవటంతో ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు అని పరిశ్రమలో అంటున్నారు. పోనీ ఈ కలెక్షన్స్ వేసిన ఆ వెబ్ సైట్స్ వి ఏమైనా కచ్చితమైన లెక్కలా అంటే కావు అనే అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో 'సోర్స్' అని చెప్పి ఆ కలెక్షన్స్ తీసుకుంటూ వుంటారు. మరి ఇంతకీ ఇలా వందల, వేల కోట్లు కలెక్షన్స్ చేస్తున్న ఈ సినిమా నిర్మాతలు మరి పన్ను కట్టాలి కదా, ఎంత పన్ను కడతారు, నిజంగా బయట ప్రచారం జరుగుతున్నంత కలెక్షన్స్ కి పన్ను కడతారా, లేక వాళ్ళకి నిజమైన కలెక్షన్స్ అని చెప్పి వేరే పన్ను కడతారా. ఇవన్నీ నిర్మాతకి, ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే తెలుస్తాయి అని అంటున్నారు.

సంక్రాంతికి విడుదలైన 'గుంటూరు కారం' సినిమా కలెక్షన్స్ విషయంలో ఆ చిత్ర నిర్మాత నాగ వంశికి, కొందరి వెబ్ సైట్స్ పాత్రికేయులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. "సినిమా నిర్మాతగా నా సినిమా ఎంత కలెక్టు చేసింది అనేది నాకు తెలుస్తుంది. మీకు ఎలా తెలుస్తుంది, మీకు తెలిస్తే మీ 'సోర్స్' ఏంటో చెప్పండి," అని సదరు నిర్మాత అతని కలెక్షన్స్ తప్పు అనేవాళ్ళకి ప్రశ్న వేసాడు. అదీ కాకుండా ఏ సినిమా అయినా ఎంత కలెక్షన్స్ చేశాయి అనేది ఎవరికీ తెలియవు అని కూడా చెప్పేసాడు ఆ నిర్మాత.

Salaar-Prabhas.jpg

మరి ఈ కలెక్షన్స్ కి ప్రామాణికం ఏంటి? తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, నిర్మాతల గిల్డ్ ఇన్ని వున్నా మరి వీటిని ఎందుకు నియంత్రించడం లేదు? ఇదే విషయం తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదరప్రసాద్ ని అడిగితే, "తెలుగులో రెంటల్ ట్రాక్ అంటూ ఏమీ లేదు. మిగతా భాషల్లో వున్నాయి, అందుకని అక్కడ కలెక్షన్స్ తెలుస్తాయి, ఇక్కడ తెలుగులో అది లేదు," అని చెప్పారు దామోదర ప్రసాద్. మల్టీప్లెక్స్ లో ఎటువంటి తేడా రాదు ఎందుకంటే అందులో ఎక్కువ తక్కువలు చెయ్యడానికి పనికిరాదు, ఎటొచ్చీ ఈ సింగల్ స్క్రీన్ థియేటర్స్ తోటే వచ్చిన చిక్కంతా అని చెప్పారు దామోదర ప్రసాద్.

మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా అంటే, "ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏరియాని బట్టి ఆ ఏరియాలో థియేటర్ కలెక్షన్స్ మా ఫిలిం ఛాంబర్ లేదా నిర్మాతల మండలికి పంపితే అప్పుడు మా ద్వారా ఈ కలెక్షన్స్ ఇచ్చే వీలుంటుంది. ఇంతకు ముందు అందరినీ అడిగాము, కానీ ఎవరూ పంపలేదు. ఇప్పటికీ అడుగుతున్నాం, పంపిస్తే మా ద్వారా ప్రతి సినిమా ఎంత కలెక్టు చేసిందనే విషయం తెలియపరుస్తాం," అని చెప్పారు ప్రసాద్. సినిమా నిర్మాత తన సినిమా ఇంత కలెక్టు చేసిందని చెప్పినప్పుడు, అదే కరెక్టు అనుకోవాలి, ఎందుకంటే పన్ను కట్టేది అతనే కాబట్టి అని చెప్పారు దామోదర ప్రసాద్.

dunkireview.jpg

పరిశ్రమలో ఇంకో మాట కూడా వినపడుతోంది. కొంతమంది కావాలనే కొన్ని సినిమాల కలెక్షన్స్ తగ్గించో, లేకా ఎక్కువ చేసో చూపిస్తారని, ఎందుకంటే కలెక్షన్స్ ఎక్కువ వున్నాయి అంటే ప్రేక్షకులు ఆ సినిమా బాగుంది అనుకుంటారు అని, తక్కువ చూపిస్తే ఆ సినిమా పోయిందని ప్రేక్షకులు చూడటం మానేస్తారని కూడా ఒక మాట వినపడుతోంది. అయితే మరి ఇలా తక్కువ, ఎక్కువ చూపించినప్పుడు దాని వెనకాల ఎవరున్నారు అన్నది మాత్రం తెలియటం లేదు అని అంటున్నారు. ఇవన్నీ ఆలా ఉంచితే సామజిక మాధ్యమాల్లో అభిమానుల మధ్య తీవ్రమైన పదజాలంతో వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి ఈ కలెక్షన్స్ నేపథ్యంలో. ఇది పరిశ్రమకి అంత మంచిది కాదు అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి సినిమా అయినా బాగా ఆడితే అది పరిశ్రమకే మేలు జరుగుతుంది కదా అని అంటున్నారు.

ఇలా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉండటంతో, తెలుగు పరిశ్రమలోని సంఘాలు ఈ కలెక్షన్స్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - Jan 22 , 2024 | 05:27 PM