ఇంకొన్ని గంటల్లో సందడి మొదలు, ఏ సినిమాకి ఎంత బిజనెస్ అంటే...

ABN , Publish Date - Jan 11 , 2024 | 04:37 PM

సుమారు రూ.200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ వ్యాపారం చేసిన నాలుగు తెలుగు సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలవుతున్నాయి. నిర్మాతలు సంక్రాంతి పండగ సెలవులను డబ్బులు చేసుకుందామని పోటాపోటీగా విడుదల చేస్తున్న ఈ సినిమాల భవితవ్యం కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది, అప్పుడే సంక్రాంతి సందడి మొదలయిపోయింది...

ఇంకొన్ని గంటల్లో సందడి మొదలు, ఏ సినిమాకి ఎంత బిజనెస్ అంటే...
Four films are hitting the screens during the Sankranthi festival

తెలుగు ప్రజలు సంక్రాంతి పండగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు, అలాగే సినిమాలు కూడా అంతే ఇష్టంగా కూడా చూస్తారు. అందుకే సంక్రాంతి పండగ అనగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రతి సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదలవుతూ ఉంటాయి, ఈసారి కూడా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇంకొన్ని గంటల్లో ఈ సినిమాల సందడి ప్రారంభం కానుంది.

gunturkaaramstill.jpg

సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'గుంటూరు కారం' రాత్రి ఒంటి గంటకు షో మొదలవ్వబోతోంది. ఈ సినిమా భవితవ్యం కూడా ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమాపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి త్రివిక్రమ్, మహేష్ ఇద్దరూ చాలా నమ్మకంగా వున్నారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మాత కాగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లిగా నటించగా, ప్రకాష్ రాజ్ తాతగా నటించారు. ఇంకా చాలామంది నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తారు. మహేష్ అభిమానులు ఎంతో కాలం నుంచి త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తూ ఉండగా, ఇప్పటికి వాళ్ళ కోరిక తీరింది ఈ 'గుంటూరు కారం' సినిమాతో. ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయని కూడా చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం రూ.133 కోట్ల వరకు అయిందని అంటున్నారు. (Mahesh Babu's Guntur Kaaram is all set to storm the Box Office)

Hanuman.jpg

దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అనే సినిమాని తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందించాడు. ఈ సినిమా మొదటి ఆట ఇంకొన్ని గంటల్లో వెండితెర మీద చూపించబోతున్నారు. ఈ సినిమా విడుదల జనవరి 12 అయినా, ముందుగా ప్రీమియర్ ఆటలు ఈరోజు సాయంత్రమే చాలా సినిమా థియేటర్స్ లో వేస్తున్నారు. చాలామట్టుకు హౌస్ ఫుల్స్ కూడా అయ్యాయి. సాయంత్రం 6 గంటల 15 నిముషాలకి మొదటి ఆట ప్రారంభం కానుంది, అంటే ఈ సినిమా ఎలా ఉందో తెలుగు ప్రేక్షకులకు ఈ రాత్రికే తెలిసిపోతుంది. ఈ సినిమా హిందీలో అప్పుడే చూసేసిన ప్రఖ్యాత ట్రేడ్ అనలిస్ట్స్ తరణ్ ఆదర్శ్ చాలా బాగుంది అని ప్రశంసించారు కూడా. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం సుమారు రూ.26 కోట్ల వరకు చేసింది. ఇది ఒక ఫాంటసీ సినిమా, ఇందులో తేజ సజ్జా సూపర్ మాన్ గా కనపడనున్నాడు.

Saindhav.jpg

ఇక సీనియర్ నటుడు వెంకటేష్ తన 75వ సినిమా 'సైంధవ్' (Saindhav) తో ప్రేక్షకుల ముందుకి జనవరి 13న వస్తున్నారు. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడు దీనికి, వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఇది యాక్షన్ నేపథ్యంలో సాగే ఒక సినిమా. కథ ఒక పాప చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పాపకి ఒక వింతైన వ్యాధి వస్తే, ఆ వ్యాధికి కావాల్సిన మందు ఖరీదు కోట్లలో ఉంటే, ఆ పాప తండ్రి అయిన వెంకటేష్ ఏమి చేశారు? ఎలా పాపని బతికించుకున్నారు? అనే విషయాన్ని పోరాటాల నేపథ్యంలో చెప్పిన కథ ఈ సినిమా. శ్రద్ధ శ్రీనాథ్, ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆండ్రియా, రుహాని శర్మతో పాటు సారా పాలేకర్ అనే చిన్న పాప ప్రధాన పాత్రలో కనపడుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం రూ.25 కోట్లు చేసిందని ట్రేడ్ ఎనలిస్టులు అంటున్నారు.

naasaamirangareleasedate.jpg

ఇంకో సీనియర్ నటుడు నాగార్జున 'నా సామి రంగ' అనే సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది ఒక మల్టి స్టారర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రల్లో కనపడతారు. విజయ్ బిన్ని దీనికి దర్శకుడు, ఇది అతని మొదటి సినిమా. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తుండటం ఆసక్తికరం. కేవలం మూడు మాసాల్లో ఈ సినిమా పూర్తి చెయ్యడం విశేషం. ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్షర్ థిల్లాన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారం సుమారు రూ.18 కోట్లవరకు జరిగిందని అంటున్నారు.

ఇలా ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి పండగనాడు పోటీ పడుతూ ఉండగా, ప్రేక్షకులు ఈ నాలుగు సినిమాలని ఎలా ఆదరిస్తారో, ఇందులో ఏది పెద్ద విజయం సాధిస్తుందో, లేక అన్ని సినిమాలు ఘన విజయం సాధిస్తాయో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే మొదటి రెండు సినిమాల రివ్యూ లపై మిగతా సినిమాల ప్రభావం ఉంటుంది. అందుకని సందడి మొదలైంది.. సినిమాల భవితవ్యం తేల్చవలసింది ఇక ప్రేక్షకుల వంతు.

ఏ సినిమా ఎంత బిజినెస్

గుంటూరు కారం

మహేష్ బాబు సినిమాకు పాన్ ఇండియా సినిమా రేంజ్ లో 133 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నైజాం‌: 42 Cr

సీడెడ్ : 13.75 Cr

ఉత్తరాంధ్ర : 14 Cr

ఈస్ట్ : 8.6 Cr

వెస్ట్ : 6.5 Cr

గుంటూరు : 7.65 Cr

కృష్ణ: 6.50 Cr

నెల్లూరు: 4 Cr

ఎపి తెలంగాణ : 102.00 CR

రెస్టాఫ్ ఇండియా : 9 Cr

ఓవర్సీస్ : 20 Cr

వరల్డ్ వైడ్ గా 132.00 కోట్లు

హనుమాన్

జనవరి 12 న విడుదలవుతోన్న పాన్ ఇండియా సినిమా హనుమాన్ కు 26 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నైజాం : 7.15 Cr

సీడెడ్ : 4 Cr

ఆంధ్ర : 9.50 Cr

ఏపి తెలంగాణ :- 20.65 Cr

కర్నాటక రెస్టాఫ్ ఇండియా : 2 Cr

ఓవర్సీస్ – 4 Cr

వరల్డ్ వైడ్ గా 26.65 కోట్లు

సైంధవ్

జనవరి 13 న వస్తోన్న వెంకటేష్ సైంధవ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల బిజినెస్ చేసుకుంది.

నైజాం: 7 Cr

సీడెడ్ : 3 Cr

ఆంధ్ర : 9 Cr

ఏపి తెలంగాణ : 19 CR

రెస్టాఫ్ ఇండియా : 2 Cr

ఓవర్సీస్ – 4 Cr

వరల్డ్ వైడ్ 25 కోట్లు

నా సామి రంగ

జనవరి 14 న నాగార్జున 'నా సామి రంగ' కు 18 కోట్లు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

నైజాం : 5 Cr

సీడెడ్ : 2.2 Cr

ఆంధ్ర : 8 Cr

ఏపి తెలంగాణ : 15.30 Cr

రెస్టాఫ్ ఇండియా : 1Cr

ఓవర్సీస్ : 2 Cr

వరల్డ్ వైడ్ : 18.20 కోట్లు

Updated Date - Jan 11 , 2024 | 04:45 PM