‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చేసినందుకు గర్వంగా వుంది: శివ కందుకూరి

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:59 PM

శివ కందుకూరి కథానాయకుడిగా వస్తున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ' ట్రైలర్ ఈరోజు విశ్వక్ సేన్ చేతులమీదుగా విడుదలైంది, సినిమా మార్చి 1న విడుదలవుతోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడిని నిరాశ పరచదు అని హామీ ఇస్తున్నాను అని చెప్పాడు శివ కందుకూరి.

‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చేసినందుకు గర్వంగా వుంది: శివ కందుకూరి
Shiva Kandukuri, Vishwak Sen, Rashi Singh at the trailer launch event of Bhoothaddam Bhaskar Narayana

శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భూతద్దం భాస్కర్ నారాయణ'. ఇందులో అతను ఒక డిటెక్టివ్ గా కనిపిస్తాడు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, ఇది ఒక క్రైమ్ త్రిల్లర్ కథ అని చెప్పొచ్చు. చాలా హత్యలు జరుగుతూ ఉంటాయి, కానీ హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోతుంటారు, అప్పుడు డిటెక్టివ్ నారాయణ ఆ హత్యలు వెనక ఎవరున్నారు, ఎందుకు హత్యలు ఇలా చేస్తున్నారు అని దర్యాప్తు చేసి, ఇవి హత్యలు కావు, బలిస్తున్నారు అని ట్రైలర్ లో చెప్తాడు. ఈ సినిమాకి దర్శకుడు పురుషోత్తం.

shivakandukuribhoothaddam.jpg

ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నాం, ఈరోజు ట్రైలర్ విడుదలైంది, సినిమా మార్చి 1న విడుదలవుతోంది, అందుకు చాలా సంతోషంగా వుంది అని చెప్పాడు. "ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, విజయం సాధిస్తుందా సాధించదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా వుంది అని మాత్రం చెప్పగలను," అని చెప్పాడు.

చేసిన ప్రతి సినిమా బాగా ఆడుతుంది అని అనుకుంటాం, అయితే కొన్ని సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని నేనొక్కడినే కాదు, మా టీము అందరం నమ్మకంగా ఈ 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమా మీద వున్నాము అని చెప్పాడు శివ కందుకూరి. ప్రతి సినిమాకి కష్టపడతాము, కానీ సినిమాకి ఇంకా ఎక్కువ కష్టపడి చేసాము అని చెప్పాడు. చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి, కానీ మా ఈ క్రైమ్ థ్రిల్లర్ కి కొంచెం పౌరాణిక టచ్ కూడా ఉంటుంది. "మా సినిమా దర్శకుడు పురుషోత్తంకి పౌరాణికాలమీద అపారమైన జ్ఞానం వుంది, ఎప్పుడూ ఆ పుస్తకాలు చదువుతూ ఉంటాడు, అందుకని ఈ సినిమాలో అలాంటి పౌరాణిక కోణం కూడా ఒకటి కనపడుతుంది," అని చెప్పాడు శివ.

bhothaddambhaskar.jpg

ఇది చిన్న సినిమా అని కాకుండా, మా నిర్మాతలు స్నేహాల్, శశి, కార్తిక్ లు ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అవసరమో అంతా పెట్టారు. మామూలుగా అయితే ఒక సినిమాకి ఇంత బడ్జెట్ అని పెట్టుకొని సినిమా చేస్తారు, కానీ ఈ సినిమాకి మా నిర్మాతలు అవసరమైన చోట బడ్జెట్ పెట్టారు, అలాగే వాళ్ళు మా టీమును నమ్మారు. ఇందులో ఎక్కువగా అందరం కుర్రాళ్ళమే వున్నాం, అందుకని మా నిర్మాతలు మమ్మల్ని బాగా నమ్మి ఈ సినిమా తీశారు.

తన సినిమాని ప్రమోట్ చేసినందుకు వచ్చిన విశ్వక్ సేన్ కి ధన్యవాదాలు తెలిపాడు శివ. సినిమాలు రెగ్యులర్ గా చెయ్యడం, హిట్ కొట్టడమే కాకుండా, తనదైన ఒక పంథాని, శైలిని ఏర్పరచుకొని ముందుకు సాగుతున్నాడు విశ్వక్ సేన్. అతను ఎందరికో స్ఫూర్తి, అలాగే నాకు కూడా అతనే స్ఫూర్తి. అతను ఇలాంటి చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రెస్ మీట్ కి వచ్చి మా సినిమా గురించి మాట్లాడటం అతను ఎంత మంచి వ్యక్తి అనే విషయం తెలుస్తుంది అని విశ్వక్ సేన్ గురించి చెప్పాడు శివ.

bhothaddambhaskarnarayana.jpg

అలాగే మా సినిమా మీద మాకు నమ్మకం వుంది, అలాగే నాకు తెలుగు ప్రేక్షకుల మీద కూడా నమ్మకం వుంది. ఎందుకంటే ఇంతవరకు మంచి సినిమా ఎప్పుడు విడుదలైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు, ఇప్పుడు మా 'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమాని కూడా ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. అలాగే నిర్మాత రాహుల్ యాదవ్ మా సినిమాకి ఎన్నో సలహాలు, సహాయం చేసి ముందుకు నడిపించారు. నేను ఒక్కటే చెప్పగలను, 'నా సినిమా మిమ్మల్ని నిరాశ పరచదు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది'.

Updated Date - Feb 10 , 2024 | 05:02 PM