Sankranthi winner: సంక్రాంతి విజేత

ABN , Publish Date - Jan 16 , 2024 | 11:56 AM

నాలుగు సినిమాలు విడుదలయ్యాయి, అందులో చిన్న సినిమా అయిన 'హనుమాన్' బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్దసినిమాగా నిలిచి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచనాలు సృష్టిస్తూ, చరిత్రని తిరగరాస్తోంది. అందుకే ఈ సంక్రాంతి విజేతగా 'హనుమాన్' నిలిచింది.

Sankranthi winner: సంక్రాంతి విజేత
Sankranthi winner Hanuman

2024 సంవత్సరంలో సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ 'గుంటూరు కారం' జనవరి 12న విడుదలైతే, అదే రోజు చిన్న సినిమా 'హనుమాన్' కూడా విడుదలైంది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడు, తేజ సజ్జ కథానాయకుడు. తరువాత జనవరి 13న సీనియర్ నటుడు వెంకటేష్ నటించిన 'సైంధవ్' విడుదలయింది, దీనికి శైలేష్ కొలను దర్శకుడు. జనవరి 14న నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన 'నా సామి రంగ' విడుదలైంది. విజయ్ బిన్ని మొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ఇది, ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. (Hanuman is Sankranthi winner)

సంక్రాంతి తెలుగు వాళ్ళ పండగ, ప్రతి కుటుంబం తమ సొంత ఊర్లకి వెళ్ళటమే కాకుండా, బంధువులు కూడా ఈ పండగకి వస్తూ వుంటారు. అలాగే సినిమా కూడా సంక్రాంతి పండగలో భాగం, అందుకే చిత్ర పరిశ్రమలో కూడా సంక్రాంతి పండగ సెలవులని వ్యాపారానికి అనుగుణంగా మలుచుకోవడానికి నిర్మాతలు ఈ పండగకి సినిమాలు విడుదల చేస్తారు. మామూలుగా అయితే రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయి, కానీ ఇలాంటి పండగలప్పుడు నాలుగు సినిమాలు విడుదలైనా, ప్రేక్షకులు చూస్తారని నిర్మాతల భరోసా. అందుకే ఇలా నాలుగు సినిమాలు వేటికవే వైవిధ్యంగా వున్నవి ప్రేక్షకులని అలరిస్తాయని అనుకున్నారు. ఇప్పటికి నాలుగు రోజులయింది మొదటి సినిమా విడుదలై, మరి ఈ సినిమాల్లో సంక్రాంతి విజేత ఎవరో చూద్దాం.

Hanuman.jpg

మొదటి రోజు రెండు సినిమాలు విడుదలయ్యాయి. ప్రశాంత్ వర్మ కొంతవరకు గ్రాఫిక్స్ వుపయోగించి తెలుగులో సూపర్ హీరో చిత్రాన్ని ఈ 'హనుమాన్' సినిమాతో ప్రేక్షకులకి పరిచయం చేసాడు. ఇందులో తేజ సజ్జ సూపర్ హీరో గా నటించాడు. ఈ సినిమాకి మొదటి రోజు థియేటర్స్ కొందరు ఇవ్వలేదు, అందుకని ఈ సినిమా ప్రీమియర్ ఆటలు ఎక్కువ వేసుకున్నారు. సంక్రాంతి సినిమాలల్లో ముందు విడుదలైంది ఈ 'హనుమాన్' సినిమానే.

అయితే అనూహ్యంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అనుకున్నదానికంటే చాలా పెద్ద విజయం సాధించింది ఈ 'హనుమాన్' సినిమా. మొదటి రోజు థియేటర్స్ దొరకకపోయినా, రెండు రోజు నుండీ ఈ సినిమాకి థియేటర్స్ పెరిగాయి, అయినా ప్రేక్షకులు ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాని చూడటానికి ఎగబడ్డారు అనే చెప్పాలి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ సినిమా, అటు హిందీ మాట్లాడే ప్రాంతాలలోనూ, అటు విదేశీ మార్కెట్ లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఐదో రోజు కూడా ఈ సినిమాకి చాలా పెద్ద డిమాండ్ వుంది, అంటే ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

prashanthvarmahanuman.jpg

దర్శకుడు ప్రశాంత్ వర్మ చిన్న బడ్జెట్ లో రామాయణంలోని హనుమాన్ పాత్రని తీసుకొని అందుకు అనుగుణంగా ఒక తెలుగు సూపర్ హీరోని తెలుగు వెండితెర మీద ఆవిష్కరించాడు. ఎవరూ ఈ 'హనుమాన్' ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తాడని ఊహించలేదు. ఊహించలేని విధంగా, నూరు యోజనాల లవణ సముద్రాన్ని అవలీలగా ధాటి లంకానగరానికి వెళ్లి, సీతమ్మతో మాట్లాడి, రావణాసురిడి ముందు ధైర్యంగా నిలబడి, లంకని కాల్చి వచ్చిన హనుమని ఎంతటి విజయం సాధించారు, అలా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తూ, కొత్త చరిత్ర రాయడానికి సంకల్పించింది. ఈ సినిమా మరికొన్ని రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర హల్ చల్ చేస్తుంది అనటం నిస్సందేహం అని చెప్పొచ్చు.

అందుకే ఈ సంక్రాంతి విజేత 'హనుమాన్' సినిమా. ఈ సినిమా విజయం మొత్తం క్రెడిట్ ప్రశాంత్ వర్మకి దక్కుతుంది. అతను తాను కథని ఎలా వూహించుకున్నాడో, అలానే వెండితెర మీద ఆవిష్కరించాడు. అందుకే అతని ఊహలకు అందనంత విజయం సాధించింది ఈ సినిమా. దర్శకుడికి సినిమా పట్ల నిబద్ధత, దీక్ష, తాను ఏమి తీయదలచుకున్నాడో అదే వెండితెర మీద చూపించడానికి ప్రయత్నించడం, అంకిత భావంతో పనిచెయ్యడం, సినిమా తీస్తున్నప్పుడు, వేరే వాటిమీదకి దృష్టి పట్టకుండా తన సినిమా మీదే ఉండటం, ఇలాంటి ప్రయత్నాలతో ఒక చిన్న సినిమాతో ఎంత పెద్ద విజయం సాధించవచ్చో నిరూపించాడు ప్రశాంత్ వర్మ. కట్ అవుట్ లు కాదు, కంటెంట్ ప్రధానం అని చెప్పి తీసాడు ఈ 'హనుమాన్' ని. అందుకే అంతటి విజయాన్ని సాధించాడు. అతను ముందు ముందు ఇలాంటి సంచలనాలు మరెన్నో సృష్టిస్తాడని ఆశిద్దాం.

Updated Date - Jan 16 , 2024 | 12:05 PM