Shyam Benegal: వైభవోపేత అధ్యాయం ముగిసింది
ABN , Publish Date - Dec 24 , 2024 | 12:45 PM
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ కన్నుమూతతో భారత చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో ఓ వైభవోపేత అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.. ఈ మేరకు సంతాప తెలిపారు.
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్ (Shyam Benegal) కన్నుమూతతో భారత చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో ఓ వైభవోపేత అధ్యాయం ముగిసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) అన్నారు.. ఈ మేరకు సంతాప తెలిపారు. ‘‘భారతీయ చిత్ర రంగంలో సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టి, ఎన్నో ఆణిముత్యాలను అందించిన వ్యక్తి శ్యామ్ బెనెగల్. కొన్ని తరాల వరకు ఆయన ప్రభ వెలుగులీనుతుంది. ఆయన స్ఫూర్తి కొనసాగుతుంది. బెనెగల్ ఒక వ్యవస్థ. అనేకమంది నటులను, కళాకారుల్ని తీర్చిదిద్దారు. ఆయన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు వరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అశేష అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఒక కథను బెనెగల్ వివరించే తీరు, చలనచిత్ర రంగంపై వేసిన ముద్ర చిరస్మరణీయమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఆయన తీసిన చిత్రాలు సమాజంలో విభిన్న వర్గాల ప్రజలకు నిరంతం స్ఫూర్తినిస్తాయని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
బెనెగల్ తనకు గురువు అని, నటనలోనే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడంలో ఆయనెంతో ప్రభావం చూపించారని సీనియర్ నటి షబానా అజ్మీ పేర్కొన్నారు. తనను తొలిసారి వెండితెరకు పరిచయం చేసింది ఆయనేనని గుర్తుచేశారు. దేశంలో గొప్ప సినీ దర్శకునిగానే కాకుండా ఎంతో మేధావిగా బెనెగల్ పేరుతెచ్చుకున్నారని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కీర్తించారు. ఎంతోమందిలో ఉన్న ప్రతిభను వెలికి తీసి సినీరంగంలో పైకి తీసుకు వచ్చారని ఆయన అన్నారు. (Celebs Condolence to Shyam benegal)
బెనెగల్ మరణం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి Pawan Klayan నివాళులు అర్పించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. "వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టే కథలను వెండి తెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్యామ్ బెనెగల్ తెరపై చూపించిన పాత్రలు సమాజంలోని పరిస్థితులకు ప్రతిబింభాలుగాగా ఉండేవి. అమూల్ పాల రైతులు రూ.2 చొప్పున ఇేస్త 1976లోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకొని మంథన్ అనే సినిమాను ఆయన రూపొందించారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. అంకుర్, నిశాంత్, భూమిక, మండి, మంథన్ లాంటి చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక శైలిని చూపించారు. శ్యామ్ బెనెగల్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
శేఖర్ కపూర్, మనోజ్ బాజ్‌పేయీ, అక్షయ్‌కుమార్, కాజోల్, కరణ్‌జోహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ తదితరులు ఆయనకు నివాళు అర్పించారు.