Dil Raju: సింహాసనాన్ని అధిష్టించిన సక్సెస్ ఫుల్ నిర్మాత
ABN , Publish Date - Dec 18 , 2024 | 02:11 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు ప్రస్థానం ఏమిటో, ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దిల్ రాజుకు రీసెంట్‌గా తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలను అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఆ బాధ్యతలను దిల్ రాజు చేపట్టారు. విషయంలోకి వెళితే..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు (వెంకటరమణా రెడ్డి)ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. 2 సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. దీనికై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక జీవోని కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తనకు ఇచ్చిన పదవీ బాధ్యతలను నేడు (బుధవారం) దిల్ రాజు స్వీకరించారు. ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఛైర్మన్ సింహాసనాన్ని అధిష్టించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘‘తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకురావాలి.. అందుకు అందరి సహకారం అవసరం. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. తెలుగు సినీ పరిశ్రమకు మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ విషయంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నాపై చాలా బాధ్యత ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేసి.. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
డిసెంబర్ 18వ తేదీన తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కి వి. వెంకట రమణా రెడ్డి (దిల్ రాజు) అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భముగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని ఓ లేఖను విడుదల చేసింది. దిల్ రాజుగారి నాయకత్వంలో తెలంగాణా రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నట్లుగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్ష, గౌరవ కార్యదర్శులు ఈ లేఖలో పేర్కొన్నారు.