Devara: విదేశాలకు తారక్.. వర్కౌట్ అవుతుందా
ABN , Publish Date - Dec 26 , 2024 | 08:11 PM
Devara: ఇటీవల రిలీజైన కల్కి 2898 AD పెద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా ఉన్న చిత్రాలను జపాన్ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 'దేవర'ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'దేవర'. సక్సెస్ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. అనుకున్నట్లే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో తారక్ జపాన్ పై కన్నేశాడు. ఎందుకంటే.
సెప్టెంబర్ లో రిలీజైన 'దేవర' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమాని ఫారిన్ కంట్రీస్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఈ సినిమాని జపాన్ లో రిలీజ్ చేయనున్నారు. అంతా ఆలస్యం ఎందుకు అనుకుంటున్నారా. విదేశాల్లో సినిమా రిలీజ్ అంటే పెద్ద తతంగమే ఉంటుంది. స్క్రీన్స్ అడ్జెస్ట్ కావాలి, సెన్సార్ పనులు పూర్తి చేసుకోవాలి. ఇలా చాలా నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ ముగియాలంటే మినిమమ్ 3 నెలలు పడుతుంది. ముందే ఈ సినిమాని అక్కడ వేల థియేటర్ లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది. ఇప్పటికే జపాన్ లో ఆర్ఆర్ఆర్, ముత్తు, బాహుబలి 2, త్రీ ఇడియట్స్, దంగల్, కెజిఎఫ్ 2 టాప్ గ్రాసింగ్ మూవీస్ గా రికార్డ్ సృష్టించాయి. అయితే ఇటీవల రిలీజైన కల్కి 2898 AD పెద్ద మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే హీరోయిజం, ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా ఉన్న చిత్రాలను జపాన్ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 'దేవర'ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. "ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. బ్రిటీష్ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం మురుగ (మురళీ శర్మ) కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురగ దగ్గర పని చేయకూడదని, మరో మార్గంలో పని చేసుకుందామని చెబుతాడు. అందుకు భైర (సైఫ్ అలీఖాన్) అంగీకరించడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం మొదలవుతుంది. దేవర మాత్రం ఊరికి దూరంగా ఉంటూ సంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తాడు. దాంతో దేవర ప్రాణం తీయడానికి పన్నాగం పన్నుతాడు భైర. ఆ తర్వాత ఏం జరిగింది. అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవర కోసం భయం భయంగా ఉండే వర (ఎన్టీఆర్) ఏం చేశాడు. అసలు రత్నగిరి, ఎర్ర సముద్రంలో ఏం జరిగింది" అనేది కథ.