CPI Narayana: సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం.. సీపీఐ నారాయణ కామెంట్స్ వైరల్
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:10 PM
గురువారం తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం నేపథ్యంలో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమాను, సంధ్య థియేటర్ ఘటనను ఉద్దేశిస్తూ.. సీపీఐ నారాయణ ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఇంతకీ సీపీఐ నారాయణ ఏమన్నారంటే..
సీఎంతో సినీ ప్రముఖుల సమావేశమైన తరుణంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా ప్రయోజనాత్మమైన సినిమాలు తీస్తే ప్రజలు ఆదరిస్తారు. అయితే మధ్యమధ్యలో మంచి సందేశాత్మక సినిమాలైనా ఒక్కోసారి సరిగా ఆడకపోవడం కారణంగా వాటికి నష్టాలు వస్తూ ఉండడం వల్ల నిర్మాతలు అంతగా ముందుకు రావడంలేదు. కొందరు నిర్మాతలు వందల కోట్లతో చిత్రాలు నిర్మించి, అధికంగా వసూలు చేసే నిమిత్తం ప్రేక్షకులపై భారం వేస్తున్నారు. ఈ క్రమంలో బ్లాకులో టికెట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తూ, అదే విధంగా ప్రభుత్వాల నుండి ప్రోత్సాహాలు పొందుతూ కూడా ప్రభుత్వం అనుమతితోనే టికెట్ల ధరలు పెంచడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు.
Also Read-సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..
ఒకవైపు వేయి కోట్ల పెట్టుబడి పెట్టి రెండు వేల కోట్ల వసూళ్ళతో విజయం సాధించామని గర్వంతో ప్రకటించుకొనే ఈ భారీ చిత్ర నిర్మాతలకు అసలు ప్రాథమికంగా ప్రభుత్వాలు సహాయం చేయడమేమిటి? సందేశాత్మక చిత్రాలకు కొంతైనా సహాయం చేయకుండా మొండి చేయి చూపిస్తున్నారు. నేర ప్రవృత్తి, హింసాయుత ఇతివృత్తం, అసభ్య వ్యంగ్యార్థ సంభాషణలు కలిగిన సినిమాలను ప్రభుత్వాలెందుకు ప్రోత్సహించాలి? ఆ పైన భారీ చిత్రాల సినిమా హీరోలు సినిమాల విడుదల సమయంలో రోడ్ షో చేస్తే అమాయక ప్రజలు తోపులాటకు గురికావచ్చని ముందుగా గ్రహించి రోడ్ షో చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోకుండా నిరోధించలేక పోయింది ప్రభుత్వం.
ఎర్రచందన అక్రమ రవాణాలు, వాటి విక్రయం అనేవి పూర్తి చట్టవిరుద్ధమైన చర్యలని తెలిసీ, వాటిని కథా వస్తువుగా గ్రహించి, దాని చుట్టూతా యువతని మాయచేసి ఆకర్షించే సంభాషణలు, పాటలు, సీన్ లు, డాన్సులూ అల్లారు. సాంఘిక బాధ్యతను పక్కనబెట్టి కేవలం ధనార్జనే పరమావధిగా వ్యాపారాలు చేసే బడా నిర్మాతలను ప్రభుత్వాలే టికెట్ ధరల రూపంలో ప్రోత్సహించడం తీవ్రంగా చర్చచేయాల్సిన విషయం. చిత్రంలోని పాటలకున్న సాహిత్యము, వాటిని అభినయించే తీరును స్వయానా హీరోయిన్ అయిన రష్మికయే ప్రశ్నించింది. నిర్మాత ఒత్తిడి కారణంగా తప్పని స్థితిలో చేశానని అంగీకరించి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ‘పుష్ప’ హీరోయిన్ ఆవేదన ప్రభుత్వానికి ఆదర్శం కావాలి.
Also Read-Tollywood: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం ఎంత టైమ్ ఇచ్చారంటే?
కళారంగం లక్ష్మణ రేఖను దాటకూడదు, అదేవిధంగా భారీగా ఖర్చు చేసి అనైతిక సినిమాలు తీసి వేలకోట్లు లాభాలార్జిస్తు రాయతీల కోసం పైరవీలు, ప్రజల మీద భారం పడేట్లు ప్రభుత్వం పాల్పడకూడదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సినిమా నాయకత్వానికీ, దానికి సారథ్యం వహిస్తున్న దిల్ రాజు గార్లకు మధ్య జరుగనున్న చర్చలలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మేం కోరేదేమంటే..
కథా ఇతివృత్తం, సాంఘిక బాధ్యత పోషణ, తెలుగు సమాజం, వాటి కళా విలువల సంరక్షణ వంటి ప్రధాన లక్షణాల ఆధారంగా మాత్రమే ప్రభుత్వాలు ఇతమిద్ధమైన సినిమాను ప్రోత్సహించాలో లేదో నిర్ణయాలు తీసుకొనే ఒక సమతూకతో కూడిన వ్యవస్థ కోసం ప్రభుత్వమే సంకల్పించాలి. అదే విధంగా సినిమా నిర్మాణ వ్యవస్థ, ప్రజలు, ప్రభుత్వాలు, పాలనాయంత్రాంగం అన్నీ వారి వారి బాధ్యతలు సమర్థంగా తగిన సమయంలో తగు సరైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని కోరుతున్నాను.. ’’ అని చెప్పుకొచ్చారు.