Avantika Vandanapu: అలా.. మహేష్‌బాబును ఇంటర్వ్యూ చేశా!

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:55 PM

అవంతిక వందనపు... అచ్చ తెలుగమ్మాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న పేరు. ‘బ్రహ్మోత్సవం’తో బాలనటిగా తెరంగేట్రం చేసి... ‘స్పిన్‌’తో ఏకంగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Avantika Vandanapu: అలా.. మహేష్‌బాబును ఇంటర్వ్యూ చేశా!

అవంతిక వందనపు(Avantika vandanapu)... అచ్చ తెలుగమ్మాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న పేరు. ‘బ్రహ్మోత్సవం’తో బాలనటిగా తెరంగేట్రం చేసి... ‘స్పిన్‌’తో (Spin)ఏకంగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ హాట్‌ ఫేవరేట్‌గా దూసుకెళ్తోంది. తాజాగా ‘మీన్‌ గర్ల్స్‌’లో మెరిసిన ఈ చిన్నదాని కబుర్లివి..

హాలీవుడ్‌కు అలా...


నేను పుట్టి పెరిగింది కాలిఫోర్నియాలో. నా పదో యేటా ఓ ఛానెల్‌ నిర్వహించిన ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌’ (నార్త్‌ అమెరికన్‌ ఎడిషన్‌) షో కోసం ఇండియాకు వచ్చి, ఆ పోటీలో రన్నరప్‌గా నిలిచా. దాంతో ‘బ్రహ్మోత్సవం’లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘ప్రేమమ్‌’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘అజ్ఞాతవాసి’... వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలోనూ నటించా. సరిగ్గా ఆ సమయంలోనే డిస్నీ ఛానెల్‌ వారు ‘స్పిన్‌’ చిత్రం కోసం ఆడిషన్‌ చేస్తున్నారని తెలిసి ఇక్కడి నుంచే ఒక టేప్‌ పంపించా. నాలుగు నెలల పాటు ఆడిషన్‌ జరిపి ఆశ్చర్యంగా నన్ను లీడ్‌ క్యారెక్టర్‌కు ఎంపికచేశారు. అలా మొత్తానికి తిరిగి యూఎస్‌ ఫ్లైటెక్కేశా.

ఇంట్లో తెలుగే...
తెలుగు, ఇంగ్లీషు, హిందీ బాగా మాట్లాడుతా. మా అమ్మానాన్న తెలంగాణ వారే కాబట్టి ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నాకు తెలంగాణ యాస బాగా వచ్చు. ఖాళీ సమయం దొరికితే చాలు వంటింట్లోకి దూరి వంటలు చేస్తుంటా. నేను చేసే కేక్స్‌ ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అందుకే ఎవరింటికి వెళ్లినా నేను చేసిన కేక్‌ వారికి ఇస్తుంటా. ఇక ఇష్టమైన ప్రదేశాల్లో హైదరాబాద్‌ ఒకటి. ముఖ్యంగా సుల్తాన్‌ బజార్‌లో దొరికే గాజులు భలే నచ్చుతాయి.

Avantika-2.jpg

తొలి నటిని నేనే..
స్వేచ్ఛ, ప్రజాహక్కు వంటి లఘు చిత్రాలతో పాటు కొన్ని వాణిజ్య ప్రకటనల్లోనూ నటించాను. చాలామందికి తెలియని విషయమేంటంటే డిస్నీ ఛానెల్‌ ఒరిజినల్‌ మూవీస్‌లో నటించిన తొలి ఇండో- అమెరిన్‌ అమ్మాయిని నేనే. భవిష్యత్తులో స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ని ప్రారంభించాలనేది నా ఆలోచన.  


సమయం తీసుకుని...
కూచిపూడి, కథక్‌ నేర్చుకున్నా. కర్ణాటిక్‌ సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అప్పుడప్పుడు గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్‌కు సమయం కేటాయిస్తా. తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి కానీ... ఇప్పట్లో చేసే ఆలోచన లేదు. దానికి మరికొంత సమయం ఉందనిపిస్తోంది.

Avantika-3.jpg

బొట్టు తప్పనిసరి
స్కూల్‌లో తోటివారంతా నా ఆహార్యం, అలవాట్లను చూసి హేళన చేసేవారు. దీంతో మొదట్లో ఇబ్బంది పడేదాన్ని. విదేశాల్లో ఉండటం వల్ల మొదట్లో నాకేం అర్థం కాలేదు. పదేళ్ల వయసులో ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడ మన సంస్కృతి బాగా నచ్చింది. దాంతో మనవైన ఆచార, వ్యవరహారాలపై నాకు మరింత ఇష్టం పెరిగింది. అమెరికా వెళ్లినా వాటినే ఫాలో అయ్యా. సంప్రదాయ, పాశ్చాత్య... ఏ దుస్తులు ధరించినా బొట్టు పెట్టుకోవడం మాత్రం పక్కా. నటన, ఫ్యాషన్‌... ఎందులోనైనా నా మార్క్‌ ఉండాల్సిందే.

వాళ్లంటే చాలా ఇష్టం
దర్శకుల్లో రాజమౌళి, సంజయ్‌లీలా భన్సాలీ, శేఖర్‌ కమ్ముల, విధు వినోద్‌ చోప్రాలంటే చాలా ఇష్టం. వీరంతా మహిళా పాత్రల్ని తెరపై చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. మహేష్‌ బాబు, పవన్‌కళ్యాణ్‌, అల్లు అర్జున్‌ నా ఫేవరెట్‌ హీరోలు. మొదటి సినిమాతోనే మహేష్‌బాబు లాంటి పెద్ద స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ‘బ్రహ్మోత్సవం’ విడుదల సమయంలో మహేష్‌బాబును ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయనకు పెయింటింగ్‌ కానుకగా ఇచ్చా.

Updated Date - Feb 25 , 2024 | 01:55 PM